హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘అడుగడగునా మహిళలను అవమానించడమే ఇందిరమ్మ రాజ్యమా? వేధింపులకు గురిచేయడమే ప్రజాపాలనా?’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. అతివలను గౌరవిస్తున్నామని చెప్పుకొనే మంత్రులు తమ ఇండ్లకు మహిళా అధికారులను పిలిపించుకొని సమీక్షలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మంత్రుల తీరుపై పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరపాలని మహిళా కమిషన్‌ను డిమాండ్ చేశారు. సునీతాలక్ష్మారెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి నేతృత్వంలో మాజీ ఎంపీ మాలోతు కవిత, బీఆర్ఎస్ మహిళా నాయకులు సుమిత్రా ఆనంద్, సామల హేమ తదితరులు సోమవారం హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు ఫిర్యా దు చేశారు. చైర్పర్సన్ లేకపోవడంతో సెక్రటరీకి ఫిర్యాదును అందజేశారు. అనంతరం సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో శాంతికుమారికి సీఎస్‌గా ఉన్నత పదవి కట్టబెట్టామని గుర్తుచేశారు.
అలాగే అనేక సంక్షేమ పథకాల్లో వారికి ప్రా ధాన్యమిచ్చారని చెప్పారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగునా మహిళా అధికారులను ఇబ్బందులుపెడుతున్నదని ఆరోపించా రు. మహిళా జర్నలిస్టులపై దాడులు చేశారని అన్నా రు. సీఎం వద్దకు వెళ్లేందుకు ఓ మహిళా మంత్రి భ యపడే పరిస్థితినెలకొనడం బాధాకరమని చెప్పారు. ఈ విషయాన్ని తాము చెప్పలేదని, మంత్రి కూతురే స్వయంగా వెల్లడించారని గుర్తుచేశారు. కొత్తగూడెంలో గిరిజన మహిళను వివస్త్రను చేసిన ఘటన వెలుగుచూశాక సర్కారు తగిన చర్య తీసుకోలేదని ఆక్షేపించారు. ఢిల్లీలో సీఎంను కలిసేందుకు ఆయన ఆఫీసుకు వెళ్లిన మహిళా అధికారిని అవమానించ డం దారుణమని విమర్శించారు. గురుకులాల్లో విద్యార్థినుల మరణాలు కలిచివేస్తున్నాయని, ఇలా అనేక నేరాలు ఘెరాలు జరుగుతున్నా ప్రభుత్వ పెద్ద లు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి మహిళా అధికారులను వేధించడం మానుకోవాలని హితవుపలికారు. కాం గ్రెస్ పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం అతివలను బలిపశువులను చేయవవద్దని విజ్ఞప్తిచేశారు.
విచారణ చేపట్టాలి: పద్మాదేవేందర్‌రెడ్డి
మహిళా అధికారులను ఇండ్లకు పిలిచి మంత్రులు రివ్యూలు చేస్తున్నట్టు వార్తలు రావడం ఆందోళన కలిగిస్తున్నదని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ చైర్పర్సన్ స్పందించి కేసు నమో దు చేసి సుమోటోగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళా అధికారుల హక్కులను కాపాడాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వా త మహిళల హక్కులకు విఘాతం కలుగుతున్నదని ఆరోపించారు. గతంలో మిస్‌వరల్డ్ పోటీలకు వచ్చిన మిల్లామ్యాగీతోపాటు ఇతర కంటెస్టెంట్లను అవమానించారని, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతమ్మ భర్తను తలుచుకొని కన్నీరు పెట్టుకొంటే బాధ్యాతయుతమైన పదవుల్లో ఉన్న మంత్రులు అపహాస్యం చేశారని విమర్శించారు.