సిరిసిల్ల టౌన్, నవంబర్ 21 : కేసీఆర్ హయాంలోనే వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి చెందిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. వేములవాడ సభలో సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును రామనామంలా జపిస్తున్నాడని తెలిపారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసిందని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. వేములవాడలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమ వేదికను రాజకీయ సభగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు.
గత కాంగ్రెస్ పాలనలో ఉరిశాలగా ఉన్న సిరిసిల్ల సిరిశాలగా మారడానికి కారణం కేటీఆర్ చేసిన కృషి ఫలితమేనని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలంలోనే మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆరోపించారు. ఎడారి ప్రాంతంగా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాను కోనసీమగా మార్చింది కేసీఆర్ అని స్పష్టంచేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కుప్పకూలిపోయాయని రాజన్న సాక్షిగా అబద్ధాలు చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. ప్రాజెక్టులు కూలిపోతే కొండపోచమ్మ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్‌కు నీళ్లు ఎట్లా వస్తున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. హెలిక్యాప్టర్‌లో వచ్చిన రేవంత్‌రెడ్డికి మిడ్‌మానేరు ప్రాజెక్టులోని నీరు కనిపించలేదా? అని నిలదీశారు.