గంగాధర, జూన్ 28 : యూరియా యాప్లో లేదు.. షాపులో లేదని, నమోదు చేసుకున్నా నోస్టాక్ ఉంటున్నదని, అలాంటి యాప్ ఎందుకని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులకు ఉపయోగపడని ఆ యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ రైతులను గోస పెడుతున్నదని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి కరీంనగర్, జగిత్యాల జాతీయ రహదారిపై ధర్నా చేశారు.
మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి గంగాధర పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా రవిశంకర్ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ యూరియా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. యాప్ సక్రమంగా పనిచేయడం లేదని, యాప్లో నమోదు చేసుకున్నా నోస్టాక్ అని చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతులు ఇబ్బందులు పడకుండా యూరియా సరఫరా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పని చేస్తే, రైతులను గోస పెట్టడమే లక్ష్యంగా రేవంత్రెడ్డి పని చేస్తున్నాడని విరుచుకుపడ్డారు. యాప్ను రద్దు చేసి, రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.