హైదరాబాద్, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ): మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్లు అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. రామ్లు 2004-2009 కాలంలో మెట్పల్లి(ప్రస్తుత కోరుట్ల) నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యేగా పనిచేశారు. న్యాయవాదిగా ప్రజలకు సేవలందించి మంచి పేరు తెచ్చుకున్నారు. కొమొరెడ్డి రామ్లు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు సీఎంవో నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రామ్లు మరణం రాజకీయంగా తీరని లోటని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావుతోపాటు పలువురు నేతలు పేర్కొన్నారు. ప్రజా రాజకీయాల్లో విద్యార్థి నాయకుడిగా, న్యాయవాదిగా, ఎమ్మెల్యేగా కొమొరెడ్డి రామ్లు చురుకైన పాత్ర పోషించారని కొనియాడారు. రామ్లు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.