కొండపాక(కుకునూరుపల్లి), నవంబర్ 25 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మిత్రుడు, దొమ్మాట మాజీ ఎమ్మెల్యే (ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గం) దొమ్మాట రామచంద్రారెడ్డి (85) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానలో మృతి చెందాడు. ఆయన స్వగ్రామం సిద్దిపేట జిల్లా కొండపాక. ఆయనకు భార్య అనంతలక్ష్మిలో పాటు ఇద్దరు కూతుళ్లు సీత, గీత ఉన్నారు.
నేవీలో ఉద్యోగం చేసిన రామచంద్రారెడ్డి టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కేసీఆర్ 1985లో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు దొమ్మాట నుంచి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది రెండు నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేశారు. నాలుగున్నర సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేసిన రామచంద్రారెడ్డి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వంలో అల్లుళ్ల పెత్తనం చెలాయించడంతో ఎన్టీఆర్ను విభేదించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు.
నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్తో విభేదించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యే కోటాలో కనీసం ఇంటి స్థలం కూడా దక్కలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రామచంద్రారెడ్డికి ఫోన్ చేసి అన్నా .. ‘ఈ తమ్ముడు ఉన్నాడని మరువకు.. నీకు ఏఅవసరం వచ్చినా ఫోన్ చేయు’ అని కోరాడు. సిద్దిపేట జిల్లా కొండపాకలో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ రామచంద్రారెడ్డి పరిస్థితిని గుర్తుపెట్టుకొని ఆయనకు సిద్దిపేటలో ఇంటి స్థలం ఇవ్వాలని నాటి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ఆదేశించాడు. ఈ కార్యక్రమానికి రామచంద్రారెడ్డి తన కూతుళ్లు సీత, గీతతో కలిసి రాగా వారిని ఆప్యాయంగా పలకరించడంతో పాటు భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అంటూ వారిని వెంట తీసుకెళ్లారు.