జనగామ, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల కోసం ఆవేదన చెందుతున్న మహిళలను డ్రామాలు ఆడుతున్నారంటూ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయన దురహంకారానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ వేడుకలను పురస్కరించుకొని ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందించే కార్యక్రమంలో మహిళలు అని కూడా చూడకుండా కడియం శ్రీహరి ప్రవర్తించిన తీరును మంగళవారం ఆయన ప్రకటనలో ఖండించారు.
కొత్తపల్లికి చెందిన గుగ్గిల్ల ఎల్లమ్మకు మొదటి విడతలోనే ఇల్లు రావడంతో ఉన్న పూరిల్లును కూలగొట్టి ముగ్గుపోసే కార్యక్రమానికి సిద్ధమైందన్నారు. తాజాగా ప్రకటించిన జాబితాలో ఎల్లమ్మ పేరు గల్లంతు కావడంతో తన పేరు లేదని అవేదన చెంది వేదికపైకి వెళ్లి కాళ్లు పట్టుకుంటే ‘ఏమైనా తమషా చేస్తున్నవా’..అంటూ కడియం సభావేదిక సాక్షిగా మాట్లాడటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కుంజూరు రజిత-నాగరాజు తమకు అర్హత ఉన్నా ఇల్లు రాలేదని ఫ్లెక్సీ పట్టుకొని శాంతియుతంగా సభలో చూపిస్తే మహిళ అని చూడకుండా పోలీసులు లాకెళ్లారని..వారిని సైతం డ్రామాలు చేస్తున్నావా అనడం కడియం శ్రీహరి అహంకారానికి పరాకాష్ఠగా నిలుస్తున్నదని ధ్వజమెత్తారు.