హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో మంత్రి శ్రీధర్‌బాబు మంథని నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏమీ లేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మండిపడ్డారు. నలభై ఏండ్ల నుంచి ఆయన కుటుంబానికి చెందినవారే ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా, మంత్రిగా కీలక పదవులు అనుభవిస్తున్న శ్రీధర్‌బాబు నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్‌బాబు వైఫల్యాలపై మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో చార్జిషీట్ విడుదల చేశారు. అనంతరం మధుకర్ మాట్లాడుతూ.. ఏడాదిలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తామని ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలికిన శ్రీధర్‌బాబు ఇప్పటివరకు కనీసం తట్డెడు మట్టికూడా తీయలేదని ధ్వజమెత్తారు.
పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు కల్పిస్తానని, మంథని నుంచి రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు రోడ్లు నిర్మిస్తానని, మెడికల్ కాలేజీ నిర్మిస్తానని నమ్మబలికి ఓట్లేయించుకున్న ఆయన ఇప్పుడు ప్రజలను నిండా ముంచుతున్నారని నిప్పులు చెరిగారు. మంథనిలో విద్యాసౌకర్యాలపై ఒక్కసారి కూడా సమీక్షించకపోవడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓడేడు బ్రిడ్జి నిర్వాసితుల ను రెచ్చగొట్టిన శ్రీధర్‌బాబు ఇప్పుడు వారికి ఒరగబెట్టిందేమిటని ప్రశ్నించా రు. మంథనిలోని పోలీస్ స్టేషన్లను కాం గ్రెస్ కార్యాలయాలుగా మార్చి మాఫి యా రాజ్యం నడిపిస్తున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలనలోనే మంథని నియోజకవర్గం అభివృద్ధి చెందిందని తెలిపారు. ఐటీ, పరిశ్రమల మంత్రిగా కీలక బాధ్యతల్లో ఉన్న శ్రీధర్‌బాబు ఈ చార్జిషీట్తోనైనా కండ్లు తెరవాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మధుకర్ డిమాండ్ చేశారు.