మల్హర్ (కాటారం), సెప్టెంబర్ 30: మంథని నియోజకవర్గంలో ప్రజలకు రక్షణగా నిలవాల్సిన కొందరు పోలీసులు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సొంత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. రెండు రోజుల క్రితం కాటారం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయగా బెయిల్‌పై వచ్చిన బీఆర్ఎస్ మండల ఇన్చార్జి జోడు శ్రీనివాస్‌ను మంగళవారం ఆయన పరామర్శించారు. అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని ప్రధాన కూడలిలో సపాయి కర్మచారి వెంకన్న కాళ్లు కడిగి, పూలమాలతో సతరించారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో పోలీసుల వ్యవహారశైలి రోజురోజుకూ శ్రుతిమించుతున్నదని మండిపడ్డారు.
సెప్టెంబర్ 28 అర్ధరాత్రి దాటిన తర్వాత కాటారం సీఐ నాగార్జునరావు తప్పతాగి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తమ్ముడు శ్రీనుబాబు ఆదేశాలతో బీఆర్ఎస్ మండల ఇన్చార్జి జోడు శ్రీనివాస్‌ను అక్రమ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు భారత రాజ్యాంగం చదవకపోతే రేపటి పరిణామాలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. దుద్దిళ్ల తన సొంత నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మధ్య చిచ్చు పెడుతున్నట్టు మండిపడ్డారు. ఇదివరకే జకు శ్రావణ్, జవ్వాజి తిరుపతి, జోడు శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టించారని, ఇన్ని కేసుల్లో పోలీసులు అభాసుపాలైన విషయాన్ని గుర్తుచేశారు. సీఐ తప్ప తాగి తూలుతున్న విషయం ఎస్పీకి, స్థానికంగా ఉండే డీఎస్పీకి తెలియకపోవడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. తప్పతాగి రోడ్లపై తిరిగే కాటారం సీఐపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.