కొడంగల్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఫార్మా కంపెనీల భూ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని రోటిబండతండాలో శుక్రవారం ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో గాయపడ్డ రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా తండాలో ఏర్పాటు చేసిన సమావేశంలో నరేందర్‌రెడ్డి మాట్లాడారు. రైతులంతా కలిసికట్టుగా ఉండి భూములను కాపాడుకోవాలని, ప్రభుత్వం, అధికారుల ప్రలోభాలకు గురి కావొద్దని సూచించారు. ఫార్మా కంపెనీలు ఏర్పాటైతే పరిసరాలు కాలుష్యంగా మారి అందరి జీవితాలు నాశనమవుతాయని, జడ్చర్లలోని అరబిందో ఫార్మా కంపెనీతో ఆ ప్రాంతం కాలుష్యంగా మారి ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. అరబిందో ఫార్మా కంపెనీని తరిమి కొడతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హెచ్చరించారని తెలిపారు. సొంత పార్టీ ఎమ్మెల్యేకు ఉన్న బుద్ధి సీఎం రేవంత్‌రెడ్డికి ఎందుకు లేదని ప్రశ్నించారు. ఈ నెల 25న జరిగిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ చాలా బాధపడ్డారని తెలిపారు. నరేందర్‌రెడ్డితో పాటు లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్‌నాయక్ రైతులను పరామర్శించారు. ప్రజల జీవనోపాధిని కూల్చేయడమేనా ప్రజాపాలన అని ప్రభుత్వంపై మండిపడ్డారు.
ప్రాణాలు పోయినా ఇవ్వం : రైతులు
తండాకు మాజీ ఎమ్మెల్యే రావడంతో రైతులు గోడు వెల్లబోసుకున్నారు. కేసీఆర్ హయాంలో రైతులు ఆనందంగా ఉన్నారని, రేవంత్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములను వదులుకొని ఎక్కడికి పోవాలే… ఏం తినాలే అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వ పథకాలతో ఎల్లకాలం జీవించలేమని, భూములుంటేనే వ్యవసాయం చేసుకుంటూ పిల్లాపాపలతో సంతోషంగా ఉంటామని విన్నవించుకున్నారు. అభివృద్ధి పేరిట భూములను తీసుకునేందుకు యత్నిస్తే పోరాటం చేస్తామని, సెంటు భూమి కూడా ఇచ్చేది లేని తేల్చిచెప్పారు. భూములను లాక్కోవాలని చూస్తే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమే అని తేల్చిచెప్పారు. తమ భూముల్లో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారని తెలిసి, బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డికి ఓట్లేసి గెలిపించడమే తాము చేసిన పాపం అని వాపోయారు. భూములను కాపాడుకునేందుకు కలెక్టర్ ఆఫీసుకే కాదు.. ఎంతవరకైనా పోయేందుకు సిద్ధం అని, భూములిస్తే మా పిల్లలు ఏ విధంగా బతకాలి అని అన్నారు.