లింగంపేట (తాడ్వాయి), జనవరి 10: కాంగ్రెస్ పార్టీ అబద్ధ్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, హామీలు అమలు చేయకుండా రైతులను, ప్రజలను మోసం చేసిందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతున్నదని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి నుంచి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వరకు 15 కిలోల మీటర్ల మేర రైతులు తలపెట్టిన ‘రైతు పోరుబాట’ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధిచెప్తారని హెచ్చరించారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.2 వేల పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచి ఇస్తామని చెప్పి ఏడాది దాటినా ఇవ్వలేదు. రైతులందరికీ రూ.2 లక్షలలోపు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి సగం మందికి కూడా చేయలేదు. మిగిలిన వారికి ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పడం లేదు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి రెండు సీజన్ల డబ్బులు ఎగ్గొట్టింది. ఇప్పుడేమో ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని చెబుతున్నది’ అని సర్కార్‌పై మండిపడ్డారు. పేదింటి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష చెక్కుతోపాటు తులం బంగారం ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించి ఏడాది గడిచినా ఇప్పటిదాకా ఒక్క జంటకు తులం కాదు కదా.. మాసం బంగారం ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. అనంతరం రైతులు, ప్రజలు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని కోరుతూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.