Congress | హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ ప్రకటించిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు చూసి తాను షాక్‌కు గురయ్యాయని, ఆ క్షణం తన మైండ్‌బ్లాంక్ అయిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదని పేర్కొన్నారు. ఈ షాక్‌కు కారణం ఏమిటన్నది భవిష్యత్తులో తెలుస్తుందని, సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతానని బాంబు పేల్చారు. ఢిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 40 ఏండ్ల సుదీర్ఘ అనుభవమున్న జెట్టి కుసుమ కుమార్‌కు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు.
ఈ విషయాన్ని ఇప్పటికే సీఎంకు, పీసీసీ చీఫ్‌కు, మంత్రులు భట్టి, ఉత్తమ్‌లకు కూడా చెప్పినట్టు తెలిపారు. రాహుల్‌గాంధీని కలిసేందుకు ఢిల్లీ వచ్చానని, ఒకవేళ అపాయింట్మెంట్ దొరక్కపోతే మంగళవారం తిరిగి హైదరాబాద్ రైలు ఎక్కేస్తానని పేర్కొన్నారు. తాను సినిమాల్లోకి రానున్నట్టు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. త్వరలో ఒక ప్రేమకథా చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది ఉగాదికి ఆ సినిమా విడుదలవుతుందని వెల్లడించారు.