నాగర్‌కర్నూల్, నవంబర్ 26 : సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లిలో పోలీసు ల నిర్బంధం మధ్య మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీఎం సొంతూరులో రెండుసార్లు ఏకగ్రీవ సర్పంచ్ గా పనిచేసిన సాయిరెడ్డి మృతిచెందితే.. పోలీసుల నిర్బంధా ల మధ్య అంత్యక్రియలు నిర్వహించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సాయిరెడ్డి మరణంపై రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని నిలదీశారు. సాయిరెడ్డి ఇంటికి దారి లేకుండా కక్ష్యసాధింపుగా గోడకట్టగా, సాయిరెడ్డి దంపతులు గోడ కట్టేందుకు తీసిన గుంతలోనే కూర్చొని నిరసన తెలిపారని గుర్తు చేశారు. సమావేశంలో కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, అచ్చంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, మాజీ జడ్పీటీసీ శ్రీశైలం, రఘువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.