హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండలంలో ముగ్గురు విద్యార్థులకు ఎస్సై జగన్మోహన్ శిరోముండనం చేయించడం దారుణమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులను చిత్రహింసలు పెట్టి గుండుకొట్టించారని, చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన ఎస్సైపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ భవన్లో శనివారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత అభిలాశ్ రంగినేనితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎస్సై ముగ్గురికి గుండు కొట్టించడంతో వారిలో ఒకరు మనస్తాపానికి గురై శుక్రవారం ఆత్మహత్యకు యత్నించడంతో ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. ఘటనపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నోరు విప్పకుండా పోలీసులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు ఊరు విడిచి వెళ్లారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడుతున్నారని, కొందరు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా మారిపోయారని విమర్శించారు. పండుగలు, క్రీడాపోటీలు అధికార పార్టీ వాళ్లు మాత్రమే చేయాలని అంటున్నారని మండిపడ్డారు. యువకుల శిరోముండనంపై ప్రభుత్వం స్పందించాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు ఎస్సైపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో శ్రీధర్‌రెడ్డి హత్య నిందితులను ఎందుకు పట్టుకోలేదని నిలదీశారు. గ్రామాల్లో గొడవలు జరిగితే అధికార పార్టీ వారిపై కేసులు పెట్టడం లేదని, బాధితులపైనే తిరిగి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎవరు తప్పు చేసినా పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.