హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. భూ దందాల ఐలయ్యగా మారారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణభవన్‌లో గురువారం బీఆర్ఎస్ నేత బీసు చందర్గౌడ్తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో కొలనుపాకలో బీర్ల ఐలయ్య భూకబ్జా బాగోతం బట్టబయలైందని, తాజాగా ఆలేరు రెవెన్యూ తండాలో భూ దందాకు తెరలేపారని మండిపడ్డారు. అమాయక గిరిజనుల భూములపై కన్నేసి అనుయాయులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. 1996లో 16 ఎకరాలను 9 మంది గిరిజనులకు అసైన్డ్ భూములు కేటాయించారని, ఆ భూములు అమ్మడానికి, కొనడానికి వీలు లేదని స్పష్టంచేశారు. కానీ, 2024 నవంబర్‌లో కొన్ని ఎకరాలను ఎమ్మెల్యే ఐలయ్య తన డ్రైవర్ కుమారస్వామి, పీఏ బాలరాజుకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ) చేశారని విమర్శించారు.
వారిద్దరి పేరిట జీపీఏ అయిన కొన్ని రోజులకే ఆ భూములు అమ్మేశారని మండిపడ్డారు. వాటిని కొన్నవారు కూడా ఐలయ్య బంధువులేనని చెప్పారు. భూములకు డిసెంబర్లో నాలా కన్వెర్షన్ కూడా జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించారు. వెంటనే ఈ సేల్‌డీడ్స్ రద్దు చేసి అసలైన హకుదారులకు భూములు అప్పగించాలని డిమాండ్ చేశారు. చిన్నచిన్న వాటికే బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్న ప్రభుత్వం, బీర్ల ఐలయ్య విషయంలో చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే ఏ తప్పు చేసినా చర్యలుండవా? అని ప్రశ్నించారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతామని చెప్పారు. చర్యలు తీసుకోని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి బాటలోనే బీర్ల ఐలయ్య పోకడలు ఉన్నాయని, భూ దందాల్లో రేవంత్‌రెడ్డినే ఎమ్మెల్యేలు ఫాలో అవుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.