జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం జరిగిన పుడ్ పాయిజన్ ఘటనతో విద్యార్థినులు, తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ఒక్కొక్కరుగా పాఠశాలను వదిలి ఇంటిబాట పడుతున్నారు. పాఠశాలలో 246మంది విద్యార్థినులకు గాను ప్రస్తుతం 100 మంది ఉన్నారు. రేపటిలోగా వారుకూడా ఇంటిదారి పట్టనున్నట్టు తెలుస్తున్నది. సోమవారం అన్నంలో పురుగులు రావడంతో 31మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా చిట్యాల, మొగుళ్లపల్లి ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స అందించారు. మంగళవారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాఠశాలను సందర్శించి స్పెషల్ ఆఫీసర్ శైలజపై మండిపడ్డారు. మీ పిల్లలను ఇలాగే చూసుకుంటారా.. ఆహారంలో పురుగులు వస్తున్నా కనిపించవా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ పాఠశాలను సందర్శించి ఎస్వోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్‌చేశారు. కలెక్టర్ రాహుల్‌శర్మ భోజనాలను పరిశీలించి స్పెషల్ ఆఫీసర్ శైలజపై ఆగ్రహంవ్యక్తం చేశారు. వంట మనుషులు ఉమాదేవి, రజిత, సరిత, లక్ష్మిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
కేంద్ర సర్వీసుకు వర్షిణి
ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణి కేంద్ర ప్రభుత్వ సర్వీసుకు బదిలీ అయ్యారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమె కేంద్ర సర్వీసులోనే కొనసాగనున్నారు.