జయశంకర్ భూపాలపల్లి, జూలై 29 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు భూపాలపల్లి నియోజకవర్గ వసతిగృహాలు, గురుకులాల బాటను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ప్రారంభించారు. మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సొంత మండలం గణపురంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. గురుకులాలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంజేపీ పాఠశాలలో ప్రహరీ, క్రీడాస్థలం లేకపోవడం, మోడల్ స్కూల్లో 380మంది ఉంటే అందులో 200మంది బాలికలే ఉన్నా కేవలం ఆరు బాత్రూంలు మాత్రమే ఉండడంపై ఆగ్రహించారు.
సరిపడా భోజనం వడ్డించడం లేదని, మొలకెత్తిన ఆలుగడ్డలు వండి పెడుతున్నట్టు విద్యార్థులు గండ్రతో చెప్పుకొన్నారు. ఎమ్మెల్యే సొంత మండలంలోని గురుకులాలు, వసతి గృహాల్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇతర మండలాల పరిస్థితి ఏమిటని గండ్ర ప్రశ్నించారు. నిర్వహణ చేతకాకపోతే జీఎంఆర్ఎం ట్రస్టుకు అప్పగించాలని సూచించా రు. ఇక నుంచి గురుకులాలు, వసతి గృహాలను తరచూ తనిఖీలు చేస్తామని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, సౌకర్యాలు అందేలా వెంట పడతామని హెచ్చరించారు. కేసీఆర్ విద్యకు ఎంతో ప్రాధాన్యమిచ్చి గురుకులాలు ఏర్పాటు చేసి అధిక నిధులు వెచ్చిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను నిర్వీర్యం చేస్తూ విద్యార్థుల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు.