హనుమకొండ, నవంబర్ 15: కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు, అరెస్ట్‌లకు భయపడే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ స్పష్టంచేశారు. ‘11 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం మాయమైంది. అభివృద్ధి దూరమైంది. తెలంగాణ ఆగమైంది’ అని అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్‌తో కలిసి దాస్యం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నాయకులు అనిల్ జాదవ్, సబితా ఇంద్రారెడ్డి సంగారెడ్డి జైలుకు వెళ్లి లగచర్ల రైతులను పరామర్శించగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. దాడి చేశారనే నెపంతో రైతులను అరెస్ట్ జేసి, జైలుకు పంపారని మండిపడ్డారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్ మాత్రం దాడి జరగలేదని, దాన్ని దాడి అనవద్దని ఆయనే స్వయంగా పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని, ప్రతీకార పాలనగా మారిందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గంలో లగచర్ల రైతుల భూమిని కబ్జా చేయాలని చూస్తుంటే కడుపుమండిన వారంతా తిరగబడినట్టు తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంతంలో ఫార్మాసిటీకి 14 వేల ఎకరాలు సేకరించారని, ఇప్పటికే 350 ఫార్మా పరిశ్రమలు స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. దాన్ని పకన పెట్టడం వెనుక రేవంత్‌రెడ్డి ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇప్పు డు కొడంగల్‌లో ఫార్మా సిటీకి భూసేకరణ జరపాల్సిన అవసరమేంటని ప్రశ్ని ంచారు. ఫార్మా క్లస్టర్ల పేరుతో గిరిజనుల జీవితాల్లో భయం నింపారని అన్నారు. లగచర్ల ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.