పరకాల, అక్టోబర్ 14 : మంత్రి కొండా సురేఖ తీరుపై అదే పార్టీకి చెందిన పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులను మందలించాల్సింది పోయి వారిని మంత్రి కొండా సురేఖ ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే బాస్ అని, ఆయనకు సముచిత స్థానం కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు.
సోమవారం హనుమకొండ జిల్లా పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గీసుకొండ వర్గపోరుపై మాజీ ఎమ్మెల్యే భిక్షపతి మీడియాతో మాట్లాడారు. గీసుకొండ మండలం ధర్మారంలో చోటుచేసుకున్న ఘటనలో మంత్రి వాస్తవాలను తెలుసుకుని స్పందిస్తే బాగుండేదని, కానీ తప్పు చేసిన వారికి అండగా నిలవడం బాధాకరమని అన్నారు.
అదే తూర్పు నియోజకవర్గంలో మంత్రి ఫొటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కొండా దంపతులు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసే కార్యకర్తలకు నాయకులు అండగా నిలవాలని, అనిల్‌పై దాడి చేయడం సరైందికాదని అన్నారు. ఏది ఏమైనా మంత్రిగా ఉన్న కొండా సురేఖ వర్గ పోరును ప్రోత్సహించడం మంచిది కాదని, ఈ విషయాన్ని తాను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.