యాదాద్రి భువనగిరి, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వ్యవసాయ క్షేత్రానికి నోటీసులు పంపిస్తారా? అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్య గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యవసాయం చేస్తుంటే అసాంఘిక కార్యక్రమాలు అంటూ నోటీసులు ఇస్తారా? అని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆత్మకూర్‌లోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకుంటుంటే పోలీసుల ద్వారా నోటీస్ ఇప్పించారని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలు రేవంత్‌రెడ్డికి అలవాటేనని, అందరూ ఆయనలాగే ఉంటారని అనుకోవడం పొరపాటన్నారు. ఇటీవల కేటీఆర్ బావమరిది గృహప్రవేశం పార్టీ చేస్తే రేవంత్‌రెడ్డి విషం చిమ్మారని గుర్తు చేశారు. పాలన చేతకాక పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు.