హైదరాబాద్, మే 26 (నమస్తేతెలంగాణ): ‘నాపై ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు బెదిరేదిలేదు.. ప్రజా పోరాటాన్ని ఆపేదీ లేదు’అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తేల్చిచెప్పారు. సింగరేణి కార్మిక సంఘం సమావేశంలో తాను మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు సృష్టించి కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కార్యాలయ కనుసన్నల్లోనే తనపై ట్రోలింగ్ చేస్తున్నారని అనుమానం వ్యక్తంచేశారు. ఉద్యమాల నుంచి వచ్చిన నేతగా మిలిటెంట్ పోరాటాలు చేయాలని శ్రేణులకు సూచించాను తప్పితే.. తన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఏవేవో ఆపాదిస్తూ, పెడార్థాలు తీస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం బీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, పల్లె రవికుమార్, కురువ విజయ్‌కుమార్, తుంగ బాలు, పడాల సతీశ్, రాజేశ్, రవీందర్‌రెడ్డి, హరిబాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యలను సాకుగా చూపి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు డీజీపీకి ఫిర్యాదు చేశారని, తన గురించి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడినట్టు తెలిసిందని చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో స్కామ్‌లకు సింగరేణి కేరాఫ్‌గా మారిందని, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ఎల్పీ లీడర్ హరీశ్‌రావు చేసిన విమర్శల నుంచి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ నాయకులు తన మాటలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బాల్క సుమన్ విమర్శించారు. ‘నాపై తెలంగాణ ఉద్యమంలో 226 కేసులున్నాయి. సీసీఎస్ డార్క్ సెల్ సహా హైదరాబాద్‌లోని అన్ని పోలీస్స్టేషన్లకు వెళ్లాను. మొన్న క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంలో 16 రోజులు జైలులో ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసులకు భయపడబోను’ అని తేల్చిచెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
‘ప్రగతిభవన్‌ను పేల్చివేస్తా’ అని గతంలో పీసీసీ అధ్య క్షుడిగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి అనలేదా? ఫార్మా కంపెనీని కాలుస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే బెదిరింపులకు దిగలేదా? నరుకుతా? అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హెచ్చరించలేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. వారిపైన కేసులు ఎందుకు పెట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు. ‘పొన్నం ప్రభాకర్.. తన వ్యాఖ్యలపై సింగరేణి కార్మికుల వద్దకు వెళ్దామా? లేదంటే రైతుల వద్దకు వెళ్దామా? అంటూ సవాల్ విసిరారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తనపై కాకుండా సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమంపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని, ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని బాల్క సుమన్ హెచ్చరించారు. పాలన వైఫల్యంతో రాష్ట్రంలోని అన్నిరంగాలు అతలాకుతలమై ఆగమయ్యాయని విమర్శించారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందంగా కాంగ్రెస్ నాయకులు చీప్ పాలిట్రిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల, రైతుల పక్షాన మాట్లాడిన తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి పొన్నం మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. నాడు ఉద్యమంలో నేడు ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న తనను కాంగ్రెస్ టార్గెట్ చేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించేలోగా రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.