వర్ధన్నపేట, ఫిబ్రవరి 13 : పారదర్శకంగా పనిచేయాల్సిన అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయంలో 12 వార్డుల ఓట్లు లెక్కించారు.
12 వార్డుల్లో 6 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 5 వార్డులు, స్వతంత్రులు ఒక స్థానం గెలుపొందారు. 12వ వార్డుకు సంబంధించి తొలుత బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్నిక 7 ఓట్లతో గెలిచినట్టు తెలిపిన అధికారులు, తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి తిరుపెల్లి వాణి 13 ఓట్ల మెజారిటీతో గెలించిందని ప్రకటించారు. దీంతో రీ కౌంటింగ్ చేయాలని బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కార్యాలయంలోకి వెళ్లి అధికారులను నిలదీసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకున్నది.
విషయం తెలుసుకున్న అరూరి రమేశ్ పార్టీ శ్రేణులతో కలిసి వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రీ కౌంటింగ్ చేపట్టాలని డిమాండ్ చేయడంతోపాటు కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. పోలీసులు అరూరి రమేశ్‌ను అరెస్ట్ చేసి రాయపర్తి పోలీసుస్టేషన్‌కు తరలించగా, కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఏజెంట్లను పోలీసులు సముదాయించేందుకు విఫలయత్నం చేశారు.