మోర్తాడ్, సెప్టెంబర్ 13: ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వకుండా అరిగోస పెడుతున్నదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో మీడియాతో వేముల మాట్లాడారు. యూరియా కోసం బీఆర్ఎస్ పక్షాన అసెంబ్లీలో పోరాటం చేసినా, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కావాలని మొత్తుకుంటున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్‌రెడ్డికి దున్నపోతు మీద వానపడ్డట్టే ఉన్నదని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ పాత రోజులు వస్తాయని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని, ఆ మాటే ఇప్పుడు నిజమైందని రైతులు గుర్తు చేసుకుటున్నారని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామని రైతులు బాధపడుతున్నారని పేర్కొన్నారు.
వరి పొట్టదశకు వస్తున్నది, రెండు మూడు రోజుల్లో యూరియా అందకపోతే దిగుబడి తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పారు. యూరియా బస్తా ఇవ్వడం చేతగాని రేవంత్‌రెడ్డి లక్ష కోట్లతో ఫ్యూచర్ సిటీ కడుతాడట అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని యూరియా కోసం నిలదీస్తే కేంద్రంపై నెపం వేస్తున్నారని విమర్శించారు. యూరియాపై సమీక్ష చేయడానికి సమయం లేదు కానీ నిత్యం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను తిట్టడానికి సమయం దొరుకుతదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన అప్పులతో మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, రోడ్లు, బ్రిడ్జిలు, చెక్‌డ్యాంలు, భవనాలు, హాస్పిటల్స్ తదితర పనులు చేపట్టామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేండ్లలోనే రూ.2.20 లక్షల కోట్లు అప్పు చేసి తట్టెడు మట్టి ఎక్కడన్న తీసినవా, ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టినవా, ఒక్క గుంతయినా పూడ్చినవా, ఏంచేశావు చెప్పు రేవంత్‌రెడ్డి అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారని తెలిపారు.