డిచ్పల్ల్లి, ఏప్రిల్ 11: పాలన చేతగాక సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వెలిగిపోగా, 16 నెలల కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయంలో 14వ స్థానానికి, జీఎస్డీపీలో 11వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో డిచ్‌పల్లిలో శుక్రవారం వేముల సమావేశమై మాట్లాడారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీయాలని సూచించారు. తలసరి ఆదాయంలో నాడు నంబర్‌వన్‌గా ఉన్న రాష్ర్టాన్ని రేవంత్‌రెడ్డి 14వ స్థానానికి తీసుకొచ్చారని విమర్శించారు. పింఛన్లు రూ.4 వేలు, మహిళలకు రూ.2,500, కల్యాణలక్ష్మి, తులం బంగారం, రూ.15 వేల రైతుభరోసా, రూ.2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఆడపిల్లలకు స్కూటీలు.. ఇలా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు చేసేలా బీఆర్ఎస్ కార్యకర్తలు పోరాటం చేయాలని సూచించారు.
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి: బాజిరెడ్డి
బీఆర్ఎస్ ఏర్పడి 25 ఏండ్లు అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభ ను విజయవంతం చేయాలని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. 15న డిచ్‌పల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత రాజకీయాల పరిణామాలపై దిశానిర్దేశం ఉంటుందని, భారీగా తరలిరావాలని కార్యకర్తలు, ప్రజలను కోరారు.