హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): శాసనసభలో ప్రాజెక్టులపై పీపీటీ (పవర్‌పాయింట్ ప్రజెంటేషన్)కి ప్రధాన ప్రతిపక్షంగా తమకూ అవకాశం కల్పిస్తే బీఆర్ఎస్ శాసనసభ్యులందరం సభకు వెళ్తామని మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. ఇదే విషయమై స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు తాము విజ్ఞప్తి చేశామని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో శనివారం గంగుల కమలాకర్, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో ఇదే శాసనసభలో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి పీపీటీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ సభ్యులు శాసనసభను బహిషరించారని గుర్తుచేశారు.
పీపీటీ ఇవ్వ డం శాసనసభ నిబంధనలకు విరుద్ధమని కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు స్వయంగా ఉత్తమ్, భట్టి సంతకాలు చేసిన లేఖను స్పీకర్‌కు అందజేశారని తెలిపారు. అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ కూడా అసెంబ్లీలో పీపీటీని వ్యతిరేకించారని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తుంగ లో తొక్కి పీపీటీ ఇచ్చిందని విమర్శించారు. ఇది కాంగ్రెస్ ద్వంద్వనీతికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం సుదీర్ఘ ప్రసంగం చేయడం శాసనసభ చరిత్రలో ఇప్పటివరకు చూడలేదని, ఇలా మాట్లాడటం శాసనసభ నిబంధనలకూ విరుద్ధమని చెప్పారు.
మూసీ ప్రక్షాళనకు వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తారని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నలకు సీఎం సరైన సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ సభ్యులపై అసభ్యంగా, అడ్డగోలుగా మాట్లాడారని ఆరోపించారు. దానికి స్పీకర్ అడ్డు చెప్పకుండా, ప్రతిపక్షానికి కనీసం మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో ఇన్ని అవమానాలు తమకు జరగలేదని విమర్శించారు. తెలంగాణవాదాన్ని కూడా అసెంబ్లీలో గట్టిగా వినిపించామని, గతంలో శాసనసభకు కాలిన మోటర్లు, ఎండిన వరి పైరు తీసుకెళ్లామని గుర్తుచేశారు.
తిట్టేందుకే సీఎం సభకొచ్చారు: గంగుల
బీఆర్ఎస్ సభ్యులను తిట్టేందుకే సీఎం రేవంత్ సభకు వచ్చారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ప్రశ్నోత్తరాలలో ఆయన రెండు గంటలు కడుపు నిండా తిట్టారని మండిపడ్డారు. ఇది నిబంధనలకే విరుద్ధమని ఆరోపించారు. ఉపాధి హామీ పథకంపై మాట్లాడటానికి జగదీశ్‌రెడ్డి, తాను సిద్ధంగా ఉన్నామని చెప్పారు.‘స్పీకర్ స్వయంగా ‘ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వం’ అని చెప్పడమేంటి అని ప్రశ్నించారు. రేవంత్‌కు భజన చేసేందుకు అసెంబ్లీకి వెళ్లాలా? అని ప్రశ్నించారు.
స్పీకర్, సీఎం రేవంత్ సభా సంప్రదాయాలను తుంగలో తొకుతున్నారని విమర్శించారు. సమస్య తీవ్రతను సభ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నో ప్రయత్నాలు చే శామని, తెలంగాణ వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఇలా జరుగడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ హుందాగా నడిచిందని గుర్తుచేశారు. గత స్పీకర్ ప్రతిపక్షాలకు తగినంత సమయం ఇచ్చారని చెప్పారు. సమావేశంలో శాసనసభలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానందగౌడ్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాధవరం కృష్ణారావు, డాక్టర్ కే సంజయ్, కాలేరు వెంకటేశ్, మాణిక్‌రావు, విజయుడు పాల్గొన్నారు.