ఖైరతాబాద్, జూలై 31: భారత్‌లో మహాత్మా జ్యోతిబాఫూలే ప్రారంభించిన ఉద్యమం నేటికీ కొనసాగుతూనే ఉందని, దేశంలో అనేక ప్రభుత్వాలు వచ్చినా బీసీలకు రాజ్యాధికారం ఇవ్వలేదని, రాజ్యాంగం రాసేటప్పుడు కూడా అనైక్యత వల్లే వెనుబడిపోయామని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో హోటల్ తాజ్‌కృష్ణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మన చేతిలో బలం పెట్టుకొని ఓట్లు మాత్రం ఇతరులకు వేస్తున్నామన్నారు. దేశంలో 3,300 పైగా ఉన్న వెనుకబడిన కులాల్లో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో అప్పుడే రాజ్యాధికారం వస్తుందని చెప్పారు. కులగణన ఒక రాష్ట్రంలో చేస్తే సరిపోదని, ఇందుకు పూర్తి స్థాయిలో రాజ్యాంగ సవరణ చేయాలని అన్నారు.
బీహార్‌లో చేసినా హైకోర్టు కొట్టేసిందని, హైదరాబాద్‌లో గతంలో ముల్కీ రూల్స్ అమలు చేయాలని రాజ్యాంగ సవరణ చేస్తే అది అమలుచేయకుండా చేశారని గుర్తుచేశారు. దేశ జానాభాలో 80 శాతం ఉన్న బీసీలు గట్టిగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తే రాజ్యాంగ సవరణ ఎందుకు కాదని ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ జరిగితే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కొందరు తమ రాజకీయ మూలాలు కదులుతాయన్న ఉద్దేశంతో, ప్రజల్లో మార్పు వస్తుందన్న భయంతో ఈ అంశాన్ని పక్కనపెడుతున్నారని చెప్పారు. బీసీ జనగణనపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో తీర్మానం చేశామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చిందని తెలిపారు.
గతంలో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బీసీ గణన చేస్తామని తొలుత చెప్పారని, తిరిగి సుప్రీంకోర్టులో తాము చేయబోమని పిటీషన్ దాఖలు చేశారని చెప్పారు. ఇలాంటి సమావేశాలు ఉమ్మడి పది జిల్లాల్లో కూడా పెట్టాలని, తర్వాత నియోజకవర్గ, గ్రామీణ స్థాయిలో నిర్వహించాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ స్థాయిలో చర్చలు నిర్వహించాలని చెప్పారు. సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీపీ ఎందుకు కాలేకపోతున్నామన్న ఆలోచన అక్కడి ప్రజలకు రావాలన్నారు. కులగణన విషయంలో తెలంగాణ నుంచే అగ్గి రాజేయాలని, అది దేశ స్థాయిలో వ్యాపించాలని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను పోస్ట్‌పోన్ చేసి కులగణన చేసిన తర్వాతే నిర్వహించాలని డిమాండ్ చేశారు.