హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వానికి బీర్ల స్టాక్ పెంచడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు అవసరమైన యూరియా స్టాక్ పెంచడంపై లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు డిస్టిలరీస్ కంపెనీలకు చెందిన గోడౌన్లను సందర్శించి రానున్న వేసవి కోసం బీర్ల స్టాక్ పెంచాలంటూ ఆదేశాలివ్వడం విడ్డూరంగా ఉన్నదని, గ తంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదని మండిపడ్డారు. మంగళవారం ఆయ న తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను పంపి, బీర్లు, విస్కీ బాగా తయారుచేయండని, వేసవి కోసం స్టాక్ సిద్ధం చేసుకోవాలని చెప్పిస్తున్నది కానీ, రైతులకు కావాల్సిన యూరియా, ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన బస్తాలు సమకూర్చడం, దవాఖానల్లో రోగులకు మందులు అందుబాటులో ఉంచడం మీద దృష్టి పెట్టడం లేదని విమర్శించారు.
ఖమ్మం, భద్రాది-కొత్తగూడెం, జోగుళాంబ-గద్వాల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ తదితర జిల్లాల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మద్యం షాపులు నిబంధనలు ఉల్లంఘించినా, వైన్‌షాపుల యజమానులు జనతాబార్లు నడిపిస్తున్నా, బెల్ట్‌షాపుల ద్వారా మద్యం ఏరులైపారుతున్నా ప్రభుత్వం వాటిని నియంత్రించకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు.