హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగా ణ): బీసీలపై కాంగ్రెస్, బీజేపీ కపట ప్రేమను చూపుతున్నాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాల వెనుకబాటుపై చర్చ జరుగుతున్న తరుణంలో రాజకీయ లబ్ధికోసం డ్రామాలాడుతున్నాయని దుయ్యబట్టారు. కులగణన పేరిట కొత్త డ్రామాలకు తెరలేపాయని మండిపడ్డారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు దేవుడెరుగు స్థానిక ఎన్నికల్లోనూ 42శాతం కోటా ఎగ్గొట్టేందుకు కలిసికట్టుగా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణభవన్‌లో సోమవారం మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు బాలరాజుయాదవ్, కిశోర్‌గౌడ్, గౌతం ప్రసాద్, శుభప్రద్ పటేల్, కురువ విజయ్‌కుమార్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీసీ రిజ్వేషన్లపై రేవంత్ సర్కారు వైఖరిని ఎండగట్టారు.
అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బీసీ బిల్లులు ఏమయ్యాయో తెలియడం లేదని అన్నారు. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్‌కు మోక్షమెప్పుడు కలుగుతుందో తెలియక అయోమయం నెలకొన్నదని అన్నారు. ఇటీవల ఢిల్లీలో హంగామా చేసిన సీఎం రేవంత్‌రెడ్డి సాధించిందేమిటని నిలదీశారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చితే తప్ప బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత దక్కదని తెలిపారు. ఈ విషయం తెలిసినా కాంగ్రెస్, బీజేపీలు స్థానిక ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ముస్లింలను సాకుగా చూపి బీజేపీ బీసీలను మోసం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడంలేదా? ఈడబ్ల్యూఎస్‌లో ముస్లింలు లేరా? అని ప్రశ్నించారు.
నాడు జైలు మాట..నేడు తప్పు బాట..
రిజర్వేషన్ల్ల పెంపు రాష్ట్ర పరిధిలోకి రాదని, ఎవరైనా పెంచితే జైలుకు వెళ్లక తప్పదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బుకాయించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు తప్పుడు మార్గంలో వెళ్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. రాష్ట్ర పరిధిలో లేని అంశాన్ని గవర్నర్‌కు ఎందుకు పంపించారని ప్రశ్నించారు. అంటే సాధ్యం కాదని తెలిసే నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. మంత్రులు సైతం సీఎంకు వంతపాడుతూ సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. బీసీ మంత్రులు 42శాతం కోటా కోసం ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి బిల్లుకు ఆమోదించిన తర్వాతే తిరిగి రావాలని హితవు పలికారు.
మోసం చేస్తే వదిలి పెట్టం : దాస్యం
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ డిమాండ్ చేశారు. ‘అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని అసెంబ్లీలో గొప్పలు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? ప్రధాని మోదీని చూసి భయపడుతున్నారా? అని ప్రశ్నిం చారు. ప్రతి ఎన్నికల హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.