పూర్తిస్థాయిలో బలమున్నా.. ఫిరాయింపులను రేవంత్ ప్రోత్సహించడం వెనుక పెద్ద స్కెచ్ ఉన్నది. రేపటిరోజున ఇబ్బందులొస్తే ఫిరాయింపుదార్లు, కొందరు కాంగ్రెస్, మరికొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో కలిసి కొత్త కథ నడుపాలనేది ఆయన వ్యూహం. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా తాము సీఎంతో కలిసి సాగుతున్నామని అంటున్నారే తప్ప, కాంగ్రెస్‌తో కలిసి నడుస్తున్నామని ఎక్కడా చెప్పడం లేదు
– జీవన్‌రెడ్డి
జగిత్యాల సభను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు సిల్లీ రాజకీయాలు చేస్తున్నరు. కేసీఆర్ జగిత్యాలకు వస్తున్న రోజే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడిగడ్డకు వెళ్తారట! రెండున్నరేండ్ల నుంచి మేడిగడ్డకు వెళ్లేందుకు సీఎంకు సమయమే లేకుండెనా? కేసీఆర్ బహిరంగ సభ ఇకడ ఉన్నప్పుడే ఆయనకు అర్జెంట్‌గా మేడిగడ్డకు పోయే పనిపడిందా?
– కేటీఆర్
జగిత్యాల, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ‘150 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిండు. తన వారిని వాటాదారులుగా చేర్చుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నడు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి కాకుండా చేసిందే ఆయన. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం, ఇండియా కూటమిని సైతం విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నడు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా సీఎం తాబేదారులే. వారంతా సీఎంతో కలిసి నడుస్తున్నం అంటున్నారే తప్ప.. కాంగ్రెస్‌తో కలిసి నడుస్తున్నామని చెప్పడం లేదు’ అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రత్యేక తెలంగాణను సాధించిన ఉద్యమనేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి రేవంత్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చాడని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాడని విమర్శించారు. ‘సీఎం రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు.
తెలంగాణ అంతటికీ మేడిగడ్డే అన్నపూర్ణ అని, దాన్ని వినియోగంలోకి తేవాల్సిందేనని స్పష్టం చేశారు. కేసీఆర్ జైత్రయాత్ర జగిత్యాల నుంచే మొదలవుతుందని చెప్పారు. నాలుగున్నర దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి.. ఆ పార్టీలో అవమానాలకు తోడు, ప్రజల్లో వస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో ఆ పార్టీని వీడానని ప్రకటించారు. ఈ నెల 20న జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆపార్టీలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
జీవన్‌రెడ్డి: నాలుగున్నర దశాబ్దాల అనుబంధం కలిగిన ఆ పార్టీని వదిలిపెట్టడం బాధాకరమే. కానీ, నేను ఆ పార్టీని వీడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతగా సర్దిచెప్పుకొన్నా తప్పలేదు. కాంగ్రెస్‌ను నమ్ముకొని దశాబ్దాలుగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నది. దీన్ని ప్రశ్నించినా స్పందించేవారే లేరు. జెండా మోసిన వారికి కాకుండా ఫిరాయింపుదారులకు ప్రాధా న్యం పెరగడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ఆశలు అడియాశలయ్యాయి. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరడంలేదు. గతంలో అమలైన పథకాలూ నిలిచిపోయాయి. అన్నివర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడాల్సి వచ్చింది.
ప్రజాహితం కోసమే పార్టీని వీడాల్సి వచ్చింది. తెలంగాణ సాధకుడు కేసీఆర్.. రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమ మార్గంలో నడిపేందుకు శతవిధాలా ప్రయత్నించి విజయం సాధించారు. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి చూపించారు. 2023 డిసెంబర్లో కేసీఆర్ కంటే మెరుగైన ప్రయోజనాలు అందిస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఈ ప్రచారంతోనే అధికారంలోకి వచ్చింది. తీరా వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి ఈ రెండున్నరేండ్లలో ఏ పథకాన్ని సరిగా అమలు చేయలేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే మాట ప్రజల్లో నుంచే వచ్చింది. ప్రజలకు నిజమైన హితాన్ని ఇచ్చేది బీఆర్ఎస్, కేసీఆర్ అనే నమ్మకం కుదిరింది. అందుకే కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నా.
కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవం కోసమే పార్టీని వదిలిపెట్టా. సీఎం రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఫిరాయింపుదారుడైన ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన వారికే టికెట్లిచ్చారు. 50 వార్డులున్న జగిత్యాలలో నేను సూచించిన వారిలో 20 మందికే టికెట్లిచ్చారు. 30 మంది పార్టీతో సంబంధం లేనివారే. రాయికల్‌లో 12 వార్డులుంటే 8 మంది పార్టీకి సంబంధం లేని వారికి బీఫామ్‌లు ఇచ్చారు. కార్యకర్తల కోసం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయించా. మార్కెట్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులకు నేను పేర్లు సూచించినా వాటిని పరిగణనలోకే తీసుకోలేదు. కేసీఆర్, నేను సమకాలికులం. ఒకే పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేశాం. నన్ను అన్నా అని పిలుస్తాడు. కేసీఆర్‌ను కలిసిన సమయంలో ఆయ న నన్ను ఆలింగనం చేసుకున్నారు. అంటే మో కరిల్లినట్టా? కేసీఆర్ అందరినీ గౌరవిస్తారు. సీఎం రేవంత్‌రెడ్డి లెక్క దుర్భాషలు మాట్లాడే మనిషి కాదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా కూలిపోతుంది? కాంగ్రెస్ పార్టీకి 66 మంది ఎమ్మెల్యేల బలముంది. బీఆర్ఎస్కు 38, బీజేపీకి 8 మంది సభ్యులున్నారు. ఒక సీపీఐ ఎమ్మెల్యే మద్దతుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు అదనంగా ఉన్నారు. సర్కార్ ఎట్లా కూలుతుంది? ఒకవేళ కాంగ్రెస్ సభ్యులు పార్టీ ఫిరాయిస్తే స్పీకర్ కాంగ్రెస్ వాడే కదా? నిబంధనల ప్రకారం సభ్యత్వం రద్దవుతుంది కదా! ప్రభుత్వం కూల్చివేత సాధ్యం కాదు. ఇది కేవలం సీఎం రేవంత్‌రెడ్డి బహానా మాత్రమే. కేవలం రేవంత్‌రెడ్డి తన సొంత కూటమిని పార్టీలో పెంచుకునేందుకు ఈ ఫిరాయింపులకు పాల్పడ్డారు.
రేవంత్‌రెడ్డికి ఆయనపై ఆయనకే నమ్మకం లేదు. పూర్తిస్థాయిలో బలమున్నా.. సీఎం ఫిరాయింపులను ప్రోత్సహించడంపై పెద్ద స్కెచ్ ఉన్నది. రేపటి రోజున సీఎం రేవంత్‌రెడ్డి తనకు ఇబ్బందులొస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలు, మరికొందరు ఎమ్మెల్యేలు, ప్రతిపక్షానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలతో కలిసి కొత్త కథను నడుపాలని వ్యూహం రూపొందించాడు. అందులో భాగంగానే ఈ ఫిరాయింపులు. కాంగ్రెస్ గుర్తు పై గెలిచిన ఎమ్మెల్యేలపై ఆయనకు నమ్మకం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం పట్టుకొన్నది. అందుకే ఫిరాయింపుదారులను ప్రోత్సహించారు. ఫిరాయించిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు ‘మేం సీఎంతో కలిసి సాగుతున్నాం’ అంటున్నారే తప్ప ‘కాంగ్రెస్‌తో కలిసి సాగుతున్నాం’ అని చెప్పడం లేదు.
2024 ఏప్రిల్‌లోనే రాహుల్‌గాంధీ ప్రధాని కావాల్సి ఉండే. కానీ, ఆయన కాకపోవడానికి కారణం సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం. 17 ఎంపీ సీట్లు ఉన్న తెలంగాణలో 8 సీట్లే కాంగ్రెస్కొచ్చాయి. కర్ణాటకలోనూ పార్టీ అనుకున్న సీట్లు సాధించలేకపోయింది. ఈ రెండు రాష్ర్టాల్లో మెజారిటీ ఎంపీ సీట్లు గెలిస్తే రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యేవారు. రాహుల్ ప్రధాని అయితే తన ఆటలు సాగవనే రేవంత్ కుట్ర చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి నియోజకవర్గం మొదలుకొని ఆయన సొంత నియోజకవర్గమైన మహబూబ్‌నగర్ వరకు అన్నింటిలోనూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఆయా స్థానాల్లో ఓటమికి సీఎంకు బాధ్యత ఉన్నది.
రేవంత్‌రెడ్డికి అలా చెప్పుకొనేందుకు అర్హతే లేదు. 2023లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ప్రభావం చూపాయి. రాష్ట్రమంతా ప్ర చారం చేసి అధికారంలోకి తెచ్చానంటున్న రే వంత్.. ఆయన ప్రాతినిధ్యం వహించిన మ ల్కాజిగిరిలోని 7 అసెంబ్లీ సీట్లలో ఎందుకు అభ్యర్థులను గెలిపించలేకపోయారు.
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మారిందన్న విషయం కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలుసు. జాతీయ పార్టీల సిద్ధాంతాలకు అనుగుణంగా వాటి రాష్ట్ర శాఖల పార్టీలు పనిచేస్తూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో సీన్ రివర్స్‌లో సాగుతున్నది. కాంగ్రెస్ అధిష్ఠానమే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కాస్తా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. కాంగ్రెస్ అధిష్ఠానం తమ అవసరాల కోసం రేవంత్ చర్యలకు వంతపాడుతున్నది.
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధకుడు. ఉద్యమాన్ని నిర్మించి రాష్ర్టాన్ని సాధించాడు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తదుపరి ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను అమల్లోకి తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చాలా గొప్ప విషయం. 152 అడుగుల ఎత్తులో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టాలని కాంగ్రెస్ భావించింది. కేసీఆర్ మహారాష్ట్రతో 148 అడుగుల ఎత్తుకు ఒప్పందం కుదుర్చుకొన్నారు. ప్రాణహిత నీటి లభ్యత అధికంగా ఉన్న నేపథ్యంలో 300 అడుగుల దిగువన మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు పిల్లర్లు కుంగిపోయాయి. వాటిని మరమ్మతు చేసి వినియోగించాలని ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది. కేసీఆర్‌కు పేరొస్తుందనే ఏడాదిగా రేవంత్‌రెడ్డి దానిని పక్కనబెట్టారు. కేసీఆర్ హయాంలో అనేక మార్పులొచ్చాయి. ప్రపంచమే ఊహించని విధంగా అభివృద్ధి సాధ్యపడింది. తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని భావించాను. అందుకే ఆయనతో కలిసి ప్రయాణం చేయాలనుకొన్నా. ఈ నెల 20న జగిత్యాల బహిరంగసభలో బీఆర్ఎస్లో చేరబోతున్నా. ఇక్కడి నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవుతుందన్న ప్రగాఢ విశ్వాసం ఉన్నది.
పదవిని ఆశించేతత్వం నాకు లేదు. అందరూ సహజంగా ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీకి వెళ్తారు. పదవులు లభిస్తాయి, ప్రయోజనాలు వస్తాయి. కానీ, నాకు అలాంటి భావం లేదు. నేను అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్తున్నా. సుదీర్ఘ ప్రజా జీవితం గడిపాను. నాకు ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నది. ఆ అవగాహనతో పనిచేస్తా. ఏ పదవి ఇస్తారు? ఏ పాత్ర ఉంటుంది? అన్న ఆలోచన లేనే లేదు. నాకు బీఆర్ఎస్లో కేసీఆర్ ఇచ్చేది పదవి కాదు, ఒక బాధ్యత. నాకు ఇచ్చిన ఆ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించడమే నాకు మొదటి నుంచి తెలిసిన విద్య.
అందులో అనుమానమే లేదు. తన అనుయాయులతో కలిసి ఇప్పటికే కుంపటి పెట్టాడు. ఫిరాయింపుదారులు, వ్యాపారులతో కలిసి ఆయన వ్యవహారం సాగిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని ఆయన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చివేశారు. ఆ కంపెనీకి ఆయనే యజమానిగా మారిపోయాడు. కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ వారెవరూ లేరు. ఉన్నవారికి పెద్దగా ప్రాధాన్యం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు కనీసం అపాయింట్మెంట్ సైతం సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చే పరిస్థితి లేదు.
ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, సీనియర్ నాయకుడు జానారెడ్డే చెప్పాలే. 2022లో పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ సోనియాగాంధీ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. ఆ స్థానాన్ని ఆశించిన అప్పటి పీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఒక ప్రముఖ చానల్‌కు 2022 జనవరి 3న ఇంటర్వ్యూ ఇచ్చారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవితో తాను సంతృప్తిగానే ఉన్నానంటూ ప్రకటించారు. అంటే అప్పటికే ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి రాలేదన్న విషయం తెలిసిపోయింది. సీనియర్ నేత జానారెడ్డితో రేవంత్‌రెడ్డి సోనియాగాంధీకి లేఖ రాయించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఫలితంపై ఎఫెక్ట్ పడుతుందని, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డికి అవకాశం ఇప్పించాలని ఆ లేఖలో కోరారు. దీంతో పరిస్థితులు మారిపోయాయి.