జగిత్యాల, ఏప్రిల్ 18: తెలంగాణ దిక్సూచి కేసీఆర్ అని, రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. జగిత్యాలలో నిర్వహించే కేసీఆర్ సభ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో శనివారం ఆయన మాట్లాడారు. నాలుగు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌కు సేవలందించిన తాను, 20 నెలలుగా తీవ్ర మానసిక క్షోభ అనుభవించానని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాసంక్షేమం కోసం పాటుపడే కేసీఆర్ సారథ్యంలో పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఈ నెల 20న కేసీఆర్ సమక్షం లో బీఆర్ఎస్లో చేరబోతున్నానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి.. కాంగ్రెస్ పోవాలి.. బీఆర్ఎస్ రావాలి’ అని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేసీఆర్ అహర్నిశలూ కృషిచేశారని, పాలనాపరమైన సౌలభ్యంతో పాటు ప్రభుత్వ సేవల ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నూతన జిల్లాలు ఏర్పాటు చేశారని కొనియాడారు.
రైతులకు పెట్టుబడి సాయం కింద కేసీఆర్ ఎకరానికి రూ.10వేలు అందిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15వేలు ఇస్తామని మాటిచ్చి మోసం చేసిందని, ఇప్పటివరకు మూడు పంటలకు ఎగ్గొట్టిందని మండిపడ్డారు. జగిత్యాలలో ఇల్లు లేని నిరుపేదల కోసం కేసీఆర్ 4వేల డబుల్ బెడ్రూం ఇం డ్లు మంజూరు చేస్తే.. వాటిని జగిత్యాల ఎమ్మెల్యే ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు. ఆనాడు జగిత్యాలలో రైతులు, రైతు కూలీలతో నిర్వహించిన జగిత్యాల జైత్రయాత్ర యావత్ సమాజాన్ని మేలొలిపితే, నేడు జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతం చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యం గా సమష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కేసీఆర్ సభ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్రం, ప్రజలతో ప్రత్యేకమైన బంధం ఏర్పడిందని, దీనిని ఏవరూ చెరిపేయలేరని ఎమ్మెల్సీ ఎల్ రమణ స్పష్టంచేశారు. సభకు హాజరై ప్రజలంతా కేసీఆర్‌ను దీవించాలని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు టీ విజయలక్ష్మి, గౌరిశెట్టి దేశాయి, మున్నా, ఆవారి శివకేసరిబాబు, జీవన్ రెడ్డి అనుచరులు పాల్గొన్నారు.