మహబూబ్‌నగర్ : కేసీఆర్ నాయకత్వంలో అందరూ కలిసి పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్(KCR) ఆమరణ దీక్షతో నాటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణను ప్రకటించిన రోజైన డిసెంబర్ 9న ‘ విజయ్ దివస్’ను మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస్ గౌడ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళ్లు అర్పించిన అంతరం స్థానిక నాయకులతో కలిసి గాలిలోకి బెలూన్లు ఎగరవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉద్యోగుల సిద్దిపేట సభలో ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో నాడు రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయన్నారు. ఉద్యమంలో మహబూబ్ నగర్ కీలక పాత్ర పోషించదన్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ ఉన్న సమయంలో తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో ఢిల్లీని వణికించి ప్రత్యేక రాష్ట్ర ప్రకటనను సాధించిన రోజు డిసెంబర్ 9 ‘విజయ్ దివస్’ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పేర్కొన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ త్యాగం చిరస్మరణీయమని అభివర్ణించారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసామన్నారు. తెలంగాణ సాధనలో అమరుల త్యాగాలు గొప్పవన్నారు.
కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ కేసి నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజు, సీనియర్ నాయకులు తాటి గణేష్, గిరిధర్ రెడ్డి, నవకాంత్, శ్రీనివాస్ రెడ్డి, మోహన్‌బాబు, అహ్మదుద్దిన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.