వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోగా, పలువురు గాయపడిన ఘటన దురదృష్టకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి ప్రకటించారు. లోపాలను సరిదిద్ది ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఏపీ సర్కారుకు సూచించారు.
తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ నాయకులు ఉపేంద్ర, నరేశ్, రాధికారెడ్డి, మంత్రి శ్రీదేవితో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచి చాలా మంది భక్తులు నిత్యం తిరుమలకు వెళ్తారని, ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా టీటీడీ టికెట్ కౌంటర్లు ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. భక్తులకు ఆన్లైన్లో టికెట్లిస్తే ఈ ప్రమాదం జరుగకపోయి ఉండేదని అభిప్రాయపడ్డారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు.