హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, క్రైం రేటు దారుణంగా పెరిగిపోయిందని, మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. శాంతిభద్రతల పరిస్థితి ఇలా తయారైతే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి రావొద్దని, ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో మహిళలకు తెలంగాణ సురక్షిత ప్రాంతంగా ఉండేదని, శాంతిభద్రతల విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని గుర్తుచేశారు.
షాద్‌నగర్‌లో దళిత మహిళను పోలీసులు హింసించిన తీరు చాలా దారుణమని, దళిత మహిళను బట్టలు విప్పి కొట్టే దుస్థితికి తెలంగాణ చేరుకున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో ఎకడా ఇలాంటి పరిస్థితి లేదని, మగ పోలీసులతో ఓ మహిళను విచారించడమా? అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో నేరాల రేటు 9 శాతం పెరిగిపోయిందని, ముఖ్యమంత్రే హోంమంత్రిగా ఉన్నారని, దీనిపై ఏం సమాధానం చెబుతారని, శాంతిభద్రతలపై సీఎం సమీక్ష చేయడం లేదా? అని నిలదీశారు. రాష్ట్రంలో లైంగికదాడులు, దొంగతనాలు, హత్యలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. షాద్‌నగర్ ఘటనలో సీఐని సస్పెండ్ చేసినంత మాత్రాన దళిత మహిళకు న్యాయం జరగదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఇకనైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.