జడ్చర్ల టౌన్/ఆత్మకూరు/ధన్వాడ/మదనాపురం, ఏప్రిల్ 22 : కాంగ్రెస్, బీజేపీలు దొందూదొందేనని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ఈ రెండు పార్టీలు చెప్పే మాయమాటలు విని ప్రజలు ఆగం కావొద్దుని సూచించారు. కాంగ్రెస్ అబద్ధ హామీల ప్రచారాన్ని నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించి ఇప్పుడు బాధపడుతున్నారని తెలిపారు. అధికారం కోసం నోటికొచ్చినట్టు హామీలిచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నారాయణపేట జిల్లా ధన్వాడ, వనపర్తి జిల్లా ఆత్మకూరు, మదనాపురంలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు జరిగాయి. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై మాట్లాడారు. మళ్లా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఐదేండ్లలో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీళ్లు పారిచ్చేదని తెలిపారు. ఎన్నో కంపెనీలు స్థాపించి నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేటోళ్లమని చెప్పుకొచ్చారు.
ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికలు ముగిశాక కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు గుడ్‌బై చెప్పడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏ రోజూ తెలంగాణ గురించి మాట్లాడలేదని గుర్తుచేశారు. ఏపీ, కర్ణాటక రాష్ర్టాల్లోని ప్రాజెక్టులకు జాతీయహోదా ప్రకటించిన కేంద్రం తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 26న పాలమూరుకు కేసీఆర్ వస్తున్నారని, పర్యటనను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌వి ఉత్తమాటలే..
కాంగ్రెస్ మోసపూరిత పార్టీ. ప్రజలను నమ్మించి మోసం చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.4 వేల పింఛన్, మహిళలకు నెలకు రూ.2,500, ఇలా ఆరు గ్యారెంటీలని ప్రజలను మోసం చేసింది’ అని నారాయణపేట జిల్లా ధన్వాడకు చెందిన మహిళా కూలి కార్యకర్త వడ్డె మంగమ్మ విరుచుకుపడ్డారు. సోమవారం ధన్వాడలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అటుగా వెళ్తున్న ఆమె బీఆర్ఎస్ మీటింగ్‌లోకి వచ్చి మైకు తీసుకొని మాట్లాడుతూ కాంగ్రెస్ పనితీరును ఎండగట్టింది. ఆరు గ్యారెంటీల్లో కేవలం ఉచిత బస్సు ప్రయాణమే అందుబాటులోకి వచ్చిందని, ఇదొక్కటి ఇస్తే సరిపోతదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఫ్రీ కరెంట్ ఇవ్వడం లేదని, చెప్పిన పనులు చేస్తలేదని, ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో మల్లెట్లా ఓట్లేయాలి? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడిందని, మోసం చేస్తే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.