హైదరాబాద్, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ) : ఏం సాధించారని కాంగ్రెస్ విజయోత్సవాలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. గత ఎన్నికలప్పుడు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయనందుకా? కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు ఇస్తానన్న 42శాతం రిజర్వేషన్లు ఇవ్వనందుకా? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన 10శాతం పనులు పెండింగ్‌లో పెట్టినందుకా? కేంద్రం నుంచి రాష్ర్టానికి నిధులు తీసుకురానందుకు సంబురాలు చేసుకుంటున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ భవన్లో మంగళవారం మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి, మంత్రులు.. ఫుట్‌బాల్ ఆడితే ఆడుకోండి కానీ, ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని పుట్‌బాల్ ఆడుకుంటారని ఎద్దేవా చేశారు.
మంచి పనులు చేయకపోవడం వల్ల సీఎం రేవంత్‌రెడ్డి సభకు జనాలు రావడం లేదని, సభకు జనాలు రాకపోవడంపై మంత్రి శ్రీహరి ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. నిరుద్యోగులకు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని సీఎం పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆగ్రహించారు. కేసీఆర్ పాలనలో పాలమూరులో కొత్తగా ఐదు రిజర్వాయర్లు కట్టించారని, ఐదు మెడికల్ కాలేజీలు, ఉమ్మడి పాలమూరుకు ఐదు జిల్లాకేంద్రాలు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. వందలాది చెరువులను బాగుచేసి వందల సంఖ్యలో చెక్‌డ్యామ్‌లు కట్టించారని గుర్తుచేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు పూర్తి చేసింది కేసీఆర్ కాదా? అని నిలదీశారు. ఉ మ్మడి ఏపీలో కాంగ్రెస్ పాలనలో పాలమూరు పట్టణానికి 15రోజులకోసారి నీళ్లొచ్చేవని, కేసీఆర్ వచ్చాక రోజూ నీళ్లిచ్చే పరిస్థితులు కల్పించారని తెలిపారు.
రేవంత్ సభ అట్టర్‌ఫ్లాప్ : పట్నం నరేందర్‌రెడ్డి
సీఎం విజయోత్సవ సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యిందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌కు పేరొస్తుందనే అక్కసుతోనే పాలమూరు-రంగారెడ్డి పనులు పూర్తి చేయడం లేదని మండిపడ్డారు. చేసిన శంకుస్థాపనలకే మళ్లీ మళ్లీ చేస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికలప్పుడు కొడంగల్-నారాయణపేట లిఫ్టునకు ఒకసారి, పంచాయతీ ఎన్నికల సందర్భంగా సోమవారం రెండోసారి శంకుస్థాపన చేశారని విమర్శించారు. కమీషన్ల కోసమే కొడంగల్ లిఫ్టును ముందుకు తెచ్చారని ఆరోపించారు. కేసీఆర్ ఫార్మాసిటీ కోసం సేకరించిన 14వేల ఎకరాలను వాడుకొంటూ ఫ్యూచర్‌సిటీని అని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్‌సిటీని నార్త్ ఇండియా సినిమా యాక్టర్లకు అప్పగించడాన్ని ఆయన తప్పుపట్టారు. కేసీఆర్ కృషి వల్లే కోకాపేటలో ఎకరాకు రూ.150 కోట్ల ధర పలుకుతున్నదని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క కోటి రూపాయల అభివృద్ధి అయినా చేశారా? అని నిలదీశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు సుమిత్రానంద్, సుశీలారెడ్డి పాల్గొన్నారు.