Srinivas Goud | అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ చట్టం తీసుకువచ్చామని.. ఇంతటితో మా పనైపోయిందని అనుకోవద్దని.. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందే వరకు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. తమిళనాడు తరహా అన్ని రంగాల్లో 42శాతం రిజర్వేషన్ కల్పించి, ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్ గాంధీ బీసీ అంశాలపై ఎక్కడికి వెళ్లినా మాట్లాడుతున్నారని, బీసీల సంక్షేమంపై తమకే చిత్తశుద్ధి ఉందని బీజేపీ చెబుతుందన్నారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని, బీసీలకు రాజ్యాధికారం ఇస్తామని మాట్లాడుతున్నాయన్నారు.
ఈ రెండు పార్టీలకు కూడా బీసీలపై చిత్తశుద్ధి నిరూపించుకునే సమయం ఆసన్నమైంది.. ఎలాంటి చిక్కులు రాకుండా తమిళనాడు తరహా అన్ని రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే విధంగా బిల్లుకు ఆమోదం తెలిపెందుకు రెండు పార్టీలు ప్రయత్నించాలన్నారు. బిల్లుకు సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కొన్ని అంశాలున్నాయని.. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని.. ఇచ్చిన మాట ప్రకారం జ్యోతిబాపూలే పేరుతో బీసీ సబ్ ప్లాన్ అమలు కోసం ఏడాదికి రూ.20వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏడాది గడిచిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి రూ.20వేల కోట్లు విడుదల చేయాలన్నారు. 42 శాతం విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుకూలంగా ఎంబీసీ మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు.
ఎన్నో ఏండ్లుగా దగా పడ్డ ప్రజలకు.. అవమానాలకు.. ఆర్థికంగా ఇబ్బంది పడిన ప్రజలు బీసీ రిజర్వేషన్లతో జీవితాలు బాగుపడుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని గతంలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీ బిల్లుపై చర్చ సమయంలో ఈ విషయంపై మాట్లాడాలని.. దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే.. అసమానతలు లేని సమాజం నిర్మాణం జరగాలన్న చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు అయితేనే సాధ్యమని అన్నారు. 42 శాతం రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఈ బిల్లుకు ఏ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా.. ఆ పార్టీని తెలంగాణలో ప్రజల మద్దతు ఉండదని పార్టీని భూస్థాపితం చేస్తారని స్పష్టం చేశారు. పార్లమెంట్ రాజ్యసభలో బిల్లు చర్చ సమయంలో భారత రాష్ట్ర సమితి పూర్తి మద్దతు ఉంటుందని ఇప్పటికే ప్రకటించిందని పేర్కొన్నారు.