Niranjan Reddy | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 10 వేలు చొప్పున ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వడగండ్లతో పాటుగా నీళ్లు, కరెంటు లేక ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు.
పంటలు నష్టపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులకు భరోసా కల్పించేందుకు సీఎం, మంత్రులు వెంటనే ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని సూచించారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ సరార్ది అన్ని రంగాల్లో మోసం, వంచన అని అన్నారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తమంటే రాజకీయ గేట్లు ఎత్తామని రేవంత్‌రెడ్డి అంటున్నారని ఎద్దేవా చేశారు.
అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని, రైతులు బాధలో ఉంటే ఒక మంత్రి, ఎమ్మెల్యే వారికి భరోసా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. నిరుడు అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటే వికారాబాద్, వరంగల్ జిల్లాలో స్వయంగా తాను, కేసీఆర్ పర్యటించి రైతులకు ధైర్యం కల్పించామని గుర్తు చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎకరానికి రూ.2000-రూ. 2500 కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదని, రైతుకన్నా మించినవాడు లేరని, ఎకరాకు రూ. 10 వేల పంట సాయం అందించాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒకే రోజు రూ. 1300 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. అప్పుడు ఎకరాకు రూ.10 వేలు ఇస్తే, బిచ్చం వేస్తున్నారా అంటూ ఇదే రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు అన్నారని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. మరి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అదే మాటపై నిలబడితే రూ.10వేల కంటే ఎక్కువ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వంద రోజుల్లో అతలాకుతలం
వంద రోజుల్లో వ్యవసాయాన్ని అతలాకుతలం చేశారని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రభుత్వం గ్రామాలకు తిరిగి వచ్చి వ్యవసాయం చేసే పరిస్థితి కల్పిస్తే, కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం వద్దు అనే పరిస్థితులు కల్పించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఇదేనా ? అని ప్రశ్నించారు.
జలాశయాల్లో ఉన్న నీళ్లను అంచనా వేసి రైతుల పంటల సాగుకు సూచన చేయమంటే ఒకనాడు ఈ ప్రభుత్వం సమీక్ష చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. కేసీఆర్ అప్పులు చేశాడని అభాండాలు వేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులకే రూ.16,400 కోట్లు అప్పు చేసిందని ఎద్దేవా చేశారు.
నిరుద్యోగులకు మొండిచేయి
అరచేతిలో స్వర్గం చూపి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు నిరుద్యోగులకు మొండిచేయి చూపుతున్నారని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ సరారు ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. గ్రూప్ 1,2,3, డీఏవో, ఎస్‌డబ్ల్యూవో, డీఎస్సీలో 5 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు కేసీఆర్ ప్రభుత్వంలో శ్రీకారం చుట్టినవేనని గుర్తు చేశారు. కానిస్టేబుల్, స్టాఫ్‌నర్సు ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వానివేనని, కాంగ్రెస్ వచ్చి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిందని చెప్పారు.
ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అని యువతకు మొండిచేయి చూపారని అన్నారు. 21 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేసిన పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 11 వేల ఉద్యోగాలనే ఎందుకు ప్రకటించారని నిలదీశారు. 46 జీవోను వారం రోజుల్లో రద్దు చేస్తామన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడేమో కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని, యువత దీనిని గమనించాలని సూచించారు. రెండు లక్షల ఉద్యోగాలలో కేసీఆర్ ప్రభుత్వం 1.60 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని, మిగిలిన 40 వేలు వివిధ స్థాయిల్లో ఉన్నాయని చెప్పారు. నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలని, ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, యువత అప్రమత్తంగా ఉండాలని నిరంజన్‌రెడ్డి సూచించారు.