హైదరాబాద్, జనవరి 21(నమస్తే తెలంగాణ): అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుపై ఎంపీ మల్లు రవి దాడి చేయడం గర్హనీయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. తనలాగే ప్రజల ఓట్లతో ఎన్నికైన తోటి ప్రజాప్రతినిధిపై సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మల్లు రవి దుర్భాషలాడుతూ చెయ్యి చేసుకోవడం శోచనీయమని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో విలువలు, ప్రజాస్వామిక స్ఫూర్తి కొరవడిందనడానికి ఈ ఘటనే తార్కాణమని బుధవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. మల్లు రవి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
విజయుడిపై దాడి చేయలేదు: మల్లు రవి
కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరుగవద్దనే ఉద్దేశంతోనే అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని పక్కకు నెట్టానని, ఆ స్వతంత్రం.. సాన్నిహిత్యం తనకున్నదని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డెపల్లి మున్సిపాలిటీలోని పైపాడ్లో జరిగిన ఘటనపై వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. శంకుస్థాపన సందర్భంగా ఇరువర్గాలు కొట్టుకునే పరిస్థితి తలెత్తేదని, రక్తపాతం జరిగేదని, అందుకే పోలీసులను పిలిచి కాస్త గట్టిగా మాట్లాడానని, గొడవ సద్దుమణగడానికే ఎమ్మెల్యేను పకకు తీసుకెళ్లానని తెలిపారు. అత్యవసర సమావేశం ఉంటే ఢిల్లీకి బయలుదేరానని వివరించారు. దీనిపై విచారణ చేసుకోవచ్చని తెలిపారు. వాస్తవాలు తెలియకుండా ఆరోపణ చేసిన వారందరూ క్షమాపణ చెప్పాలని, లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం అనుమతితో నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు.