చిన్నంబావి, ఆగస్టు 13 : కాంగ్రెస్ ప్రభుత్వ ప్రో ద్బలంతోనే రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ రాష్ట్ర నేత అభిలాష్‌రావు నివాసంలో శ్రీధర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేత బొడ్డు శ్రీధర్‌రెడ్డి హత్య జరిగి మూడు నెలలైనా కేసులో పురోగతి లేదని, నేటికీ హంతకులను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సిట్ ఏర్పాటు చేసి 27 రోజులు అవుతున్నా ఎలాంటి పురోగతి లేదని ఆరోపించారు. ఇంతకీ సిట్ ఎక్కడా? అని ఆయన ప్ర శ్నించారు. సొంత నియోజకర్గంలో హత్య జరిగితే కనీసం మంత్రి సదరు కుటుంబ సభ్యులను పరామర్శించలేదని దుయ్యబట్టారు. ఇదిలావుంటే మృతుడిపై వ్యక్తిగత ఆరోపణలకు దిగడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ హత్య జరిగినా ప్రభు త్వం, పోలీస్ యంత్రాంగం పరిష్కరించే దిశగా అడుగులు వేయాలే కానీ, వ్యక్తిగత విషయాలను లాగి కేసును పక్కదోవ పట్టించడం సరికాదని సూచించారు. పది రోజుల్లో నిందితులను న్యాయస్థానంలో నిలబెట్టకపోతే డీజీపీ కార్యాలయం ఎదు ట ధర్నా చేస్తామని హెచ్చరించారు.