హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలది ఒకటే ఎజెండా అని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడటమే వారి లక్ష్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో సరియైన అభ్యర్థులు లేక బీఆర్ఎస్ నేతలను చేర్చుకొని టికెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు చేసిన మేలు గురించి చర్చకు సిద్ధమా? అంటూ అమిత్‌షాకు కేసీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించకుండా తోకముడిచారని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, అమిత్‌షా రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా కేసీఆర్ మీద నిందలు వేయడం తప్ప ఒకటీ నిరూపించలేదని పేర్కొన్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా బలంగా ఉంటే, ఆ పార్టీకి అభ్యర్థులు ఎందుకు కరువయ్యారని ప్రశ్నించారు. దక్షిణ భారత్‌లో సమీప భవిష్యత్తులో బీజేపీ కీలకంగా వ్యవహరించే పరిస్థితిలేదని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే మనల్ని మనం దహించుకున్నట్టేనని హెచ్చరించారు. ఆ రెండు పార్టీలు దౌర్జన్యంతో రాష్ట్రాలు, ప్రాంతీయపార్టీల హకులను హరించే విధంగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు.
ఫెడరల్ స్ఫూర్తిని అంగీకరించకుంటే ప్రజాస్వామ్యాన్ని ధికరించడమేనని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని కాంగ్రెస్ చెప్పుకోవడం హాస్యాస్పదమని, కోటీశ్వరులను చేయడం సంగతి తరువాత, ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చకుండా చూడాలని చురకలేశారు. గుడ్లు పీకి గోలీలు ఆడుతాం, తొండలు వదులుతాం, మానవబాంబులం అవుతామని ముఖ్యమంత్రి అనడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంత ఉబలాటంగా ఉంటే సినిమా తీసుకుని సంతోషపడాలని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ఎందుకు బీజేపీకి గులాంగిరి చేస్తున్నారని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏక్‌నాథ్‌షిండే వస్తాడంటూ బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించే దమ్ము రేవంత్‌రెడ్డికి ఉన్నదా? అని ప్రశ్నించారు. మోదీ వస్తే ఎందుకు వెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్నారని, కేవలం నెల రోజుల్లో ఎన్నికలు పెట్టుకుని రేవంత్ ప్రధానిని ఎలా కలుస్తాడని కాంగ్రెస్ సీనియర్ నేతలే నిలదీస్తున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డికి చేతనైతే కేసీఆర్ కంటే ఎకువ పనిచేసి చూపించాలని సవాల్ చేశారు. నిందలు, బెదిరింపులు, వ్యక్తిగత దూషణలతో లాభపడతామని కాంగ్రెస్ నేతలు భావిస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, మన్నె గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.