హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రుణానికి ‘మాఫీ’ లేదు.. రైతుకు ‘భరోసా’ లేదు.. రుణమాఫీ ఒక మాయ, రైతు భరోసా ఒక భ్రమ అని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీ అయిన ఒక రైతును చూపించాలని కాంగ్రెస్ సర్కారుకు సవాల్ విసిరారు. విజయ డెయిరీకి పోసిన పాల బిల్లులు ఇవ్వకపోవటంతో రైతులు పాలను రోడ్లపై పోసి తమ నిరసన తెలియజేస్తున్నారని వెల్లడించారు. శనివారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.80 వేల కోట్ల అప్పు చేసినా ఏ రంగంలోనూ గణనీయమైన మార్పు రాలేదని విమర్శించారు. మొదట రూ.49 వేల కోట్లు రుణమాఫీకి అంచనా వేసి, ఆ తర్వాత రూ.41 వేల కోట్లు అని ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. బడ్జెట్లో మాత్రం రూ.26 వేల కోట్లే కేటాయించారని, చివరికి రూ.17 వేల కోట్లు మాఫీ చేసి చేతులు దులుపుకున్నారని వివరించారు.
వానకాలం పంట పూర్తవుతున్నా.. రైతులకు పెట్టుబడి సాయం అందలేదని, ఆ నిధులు ఎగ్గొట్టినట్టేనా? అన్న సందేహాన్ని వ్యక్తంచేశారు. వరంగల్ డిక్లరేషన్‌లో రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, పంటలబీమా, పసుపు బోర్డు, చకెర ఫ్యాక్టరీ తెరిపిస్తామని కాంగ్రెస్ గొప్పలు చెప్పిందని.. ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన వల్ల బీమా కంపెనీలకు లాభం తప్ప రైతులకు ప్రయోజనం ఉండదని ఆనాడే చెప్పామని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వంలో పంటలబీమా కోసం నాలుగేండ్లు రూ.2,400 కోట్లు బీమాకంపెనీలకు కడితే రైతులకు తిరిగి రూ.1,800 కోట్లే వచ్చాయని తెలిపారు.
రైతుతో పాటు కౌలు రైతులకూ రైతు భరోసా ఇస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారని, కానీ రైతుభరోసా ఎవరు తీసుకుంటారో రైతు, కౌలురైతు తేల్చుకోవాలని వ్యవసాయ మంత్రి చావు కబురు చల్లగా చెప్పారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ‘తెలంగాణలో కౌలు రైతు విధానం, ఏపీలో కౌలు విధానం వేరు అని అసెంబ్లీలో కేసీఆర్ పలుమార్లు చెప్పారు. తెలంగాణలో పాలుకు ఇచ్చే విధానం, ఏపీలో కౌలుకు ఇచ్చే విధానం ఉంటుందని చెప్పారు. కొందరు ఆంధ్రా నేతల చేతుల్లో ఉన్న రైతుసంఘాలు ఈ వాదన తెచ్చాయి. దాన్ని కాంగ్రెస్ అందుకుని కౌలురైతులకు రైతుభరోసా అని బురిడీ కొట్టించింది. ఇప్పుడు అసలు విషయం బయటపెట్టి ముసుగు తొలగించింది. కౌలురైతులకు రైతుభరోసా ఇవ్వబోమంటున్న కాంగ్రెస్ సరార్ వారికి క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీకి మళ్లించారని ఆరోపించారు.
రైతులకు విజయ డెయిరీ 3 నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదని, దీంతో రైతన్నలు పాలను రోడ్లపై పోసి నిరసన తెలుపుతున్నారని నిరంజన్‌రెడ్డి అన్నారు. పాల బకాయిలు ఇవ్వకుండా రైతులను హెరిటేజ్ వైపు మళ్లించే కుట్ర జరుగుతున్నదని అనుమానం వ్యక్తంచేశారు. విజయ డెయిరీకి కేసీఆర్ హయాంలో లాభాలు ఎలా వచ్చాయి? ఇప్పుడెలా నష్టాలు వస్తున్నాయి? అని ప్రశ్నించారు. రూ.204 కోట్లతో తెలంగాణలో హెరిటేజ్ పెట్టబడులు పెడుతుందని, నష్టాలు వస్తే ఆ సంస్థ పెట్టుబడి పెడుతుందా? అని నిలదీశారు. పాల రైతులు రోడ్డెకితే ఒక మంత్రి కూడా ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.