మహబూబాబాద్ రూరల్, జూలై 11 : రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. శుక్రవారం మహబూబాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన యువగర్జన సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమలుకాని బీసీ రిజర్వేషన్ విధానాన్ని తీసుకువస్తూ బీసీలను భ్రమల్లోకి దించుతున్నదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు.
మానుకోట జిల్లాకు కేసీఆర్ అనేక నిధులు కేటాయించడం వల్లే అభివృద్ధి కనబడుతున్నదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క చోట కూడా అభివృద్ధికి నిధులు కేటాయించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ యువతను మోసం చేసిందని, జాబ్ క్యాలెండర్, రాజీవ్ యువవికాసం, స్వయం ఉపాధి, నిరుద్యోగభృతి అనిచెప్పి ఓ ఒక్క టీ అమలు చేయలేదని మండిపడ్డారు. స్థానికసంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో విఫలం, కేసీఆర్ అందించిన కల్యాణలక్ష్మి, రైతుబంధు, మద్దతు ధరపై తండావాసులను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు.