శంకర్పల్లి, ఫిబ్రవరి 3 : కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అనడంలో ఎలాంటి తప్పు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. దేశానికి జాతిపితగా గాంధీని గుర్తించినట్టే, తన ప్రాణాలను పణంగా పెట్టి 14ఏండ్లు అన్ని రాజకీయ పార్టీలను, ఉద్యోగ సంఘాలు, ప్రజలను ఏకతాటిపై నడిపించి తెలంగాణ సాధించిన కేసీఆర్ను జాతిపితగా పిలవడం సమంజసమేనని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పట్టణంలోని 6, 7వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో గత రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అబద్ధాల కాంగ్రెస్తో ప్రజలు విసిగిపోయారని, ఈ సారి బీఆర్ఎస్ను గెలిపించాలనే స్పష్టతతో ఓటర్లు ఉన్నారని తెలిపారు. తెలంగాణ సాధించిన నాయకుడికి నోటీసులు జారీ చేయడం, ఆయన మరణాన్ని కోరే స్థాయికి దిగజారడం ఏం సంస్కారమని ప్రశ్నించారు.