వికారాబాద్/నవాబుపేట, ఫిబ్రవరి 5 : పూటకో మాట మార్చే కాంగ్రెస్‌ను నమ్మొద్దని, కాంగ్రెస్ పాలనలో ప్రజలు, రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో రైతు వ్యతిరేక కాం గ్రెస్ సర్కార్‌పై జంగ్ సైరన్‌కు జాతీయ మీడియా కోఆర్డినేటర్ పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి రైతు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట .. లేనప్పుడు ఓ మాట మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతున్నా 6 గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలుచేయలేదని మండిపడ్డారు. చారాణా వంతు మందికి రుణ మాఫీ చేసి 100 శాతం అయిందని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
రుణమాఫీ కావాలని రైతులు ధర్నా చేస్తే పోలీసులతో అరెస్టు చేయిస్తున్నదని మండిపడ్డారు. జనవరి 26న రైతులకు రైతుభరోసా అందుతుందని మాట ఇచ్చి మోసం చేసిందని ఎద్దేవా చేశారు. ఆసరా పింఛన్, రేషన్ కార్డులు, మహిళలకు రూ.2500, తులం బంగారం ఎక్కడ అని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం చేస్తామని మాటమార్చడంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ మాట్లాడుతూ చేవెళ్లలో ఉపఎన్నికలు వస్తాయని కేటీఆర్ ముందే చెప్పారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ మోసాన్ని రైతులు చెట్ల కింద, బావుల కాడ, ఎక్కడ పడితే అక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ తిరిగి వస్తేనే తెలంగాణ ప్రజలు బాగుపడుతారని తెలిపారు.