అశ్వాపురం, జూలై 12 : సాగుకు నీళ్లు కావాలని రైతు లు కోరితే.. ప్రతిపక్ష నేతల రక్తం పారిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి నోరుపారేసుకోవడంపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మండిపడ్డారు. రైతులకు నీళ్లివ్వడానికి తమ రక్తమే అడ్డమైతే.. ఆ రక్తాన్ని ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. ఆదివారం ఆయన అశ్వాపురంలో పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చని రిటైర్డ్ ఇంజినీర్లు ప్రభుత్వానికి లేఖ రాసినా కూడా ముఖ్యమంత్రికి సోయిలేదని విమర్శించారు.
పాపం పండిన రోజు హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్‌రెడ్డికి పడుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే మేడిగడ్డ నుంచి భద్రాచలానికి 25 లక్షల క్యూసెకుల వరద వచ్చిందని పువ్వాడ గుర్తుచేశారు. అప్పుడు కొట్టుకుపోని భద్రాచలం.. ఇప్పుడు లక్ష క్యూసెకుల ప్రవాహానికే ఎలా కొట్టుకుపోతుందని ప్రశ్నించారు. భద్రాచలం కొట్టుకుపోతుందనే కారణంతోనే మేడిగడ్డ గేట్లు తెరిచి ఉంచామని సీఎం తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. నీళ్లిస్తే కేసీఆర్‌కు పేరొస్తుందనే భయంతోనే అక్కసు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.