హైదరాబాద్, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ) : పెట్టుబడుల వివరాలే సక్రమంగా వెల్లడించని వాళ్లు 2047నాటికి త్రీ మిలియన్ ఎకానమీ ఎలా సాధిస్తారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల ల క్ష్మయ్య ప్రశ్నించారు. గ్లోబల్ సమ్మిట్ తొలి రోజున పెట్టుబడుల వివరాలను జాతీయ, ప్రధాన తెలుగు పత్రికలు పొంతన లే కుండా రాశాయని తెలిపారు. రూ.1.88 లక్షల కోట్లు అని ఒక పత్రిక, రూ.2.5 లక్షల కోట్లు అని ఓ ఆంగ్ల పత్రిక, రూ.3,97,500 కోట్లు అని ఈనాడు పత్రికలు వార్తలు రాశాయని, పత్రికలు ఊహించి రాయవని, ప్రభుత్వంలో ఉన్నవారు చెప్పిన వివరాలనే రాసి ఉంటారని తెలిపారు. వచ్చిన పెట్టుబడుల వివరాలను సరిగ్గా వెల్లడించని వాళ్లు.. త్రీ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందిస్తామంటే ప్రజలెవరూ నమ్మబోరని పేర్కొన్నారు. మంగళవారం తన నివాసంలో పొన్నాల మీడియా తో మాట్లాడుతూ.. ఏ దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా జీఎస్డీపీ రెండు రెట్లు పెరిగిందే తప్ప రెండు దశాబ్దాల్లో ఎక్కడా ఐదారు రెట్లు పెరుగలేదని చెప్పారు. త్రీ ట్రిలియన్లు కావాలంటే 15 రెట్లు పెరుగాలని, అది సాధ్యమని తాను అనుకుంటున్నట్టు తెలిపారు.