హైదరాబాద్ : మహిళా జర్నలిస్టులపై(Women journalists) భౌతికదాడి హేయమైన చర్య అని, భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ(Loan waiver) అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి(Kondareddypalli) వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండారెడ్డిపల్లి నిషేధిత ప్రాంతమా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. ప్రజాపాలన కాదిది ప్రశ్నించే గొంతుకలను నొక్కివేస్తున్న పాలన అని ధ్వజమెత్తారు రుణమాఫీపై వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్తే ఈ ప్రభుత్వానికి భయం ఎందుకు ? మహిళా జర్నలిస్టులను చుట్టు ముట్టి, ఫోన్లు, కెమెరాలు లాక్కుని దాడి చేసి బెదిరించడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వారిని భేషరతుగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం, రేవంత్ భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.