Jagdish Reddy | హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధానికి పర్యాయపదమని విద్యుత్తుశాఖ మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోసాలు, అబద్ధాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అదే అబద్ధాలతో పరిపాలన సాగిస్తున్నదని విమర్శించారు. శనివారం అసెంబ్లీలో ఉదయ్ పథకానికి చెందిన పేపర్లో ‘వ్యవసాయ వినియోగదారులు మినహా’ అనే వాక్యాన్ని చదవకుండానే సభను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. ఉదయ్ పథకానికి, కేంద్ర ఎఫ్ఆర్బీఎం రుణ ప్రతిపాదనలకు లింకు పెట్టి సభలో మాట్లాడారని, ప్రతిపక్ష బీఆర్ఎస్ను వివరణ ఇవ్వకుండా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు తన అనుకూల మీడియాలో రోత రాతలు రాయించారని దుయ్యబట్టారు.
రేవంత్‌రెడ్డి లాంటి నీచమైన సీఎం దేశంలో మరెవరూ లేరని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2017లోనే రైతుల మోటర్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకున్నట్టు, అధికారులు సంతకాలు చేసినట్టు అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పి సభను, ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి సభలో చదివింది ఉదయ్ పథకానికి చెందినదని, వ్యవసాయ వినియోగదారులు మినహా 500 యూనిట్లకుపైగా విద్యుత్తును వినియోగించే పరిశ్రమలు స్మార్ట్ మీటర్లు పెట్టాలని ఆ లేఖలో కేంద్రం పేర్కొన్నదని చెప్పారు. ఈ పథకంలో నాటి కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాలతోపాటు మొత్తం 27 రాష్ర్టాలు చేరాయని గుర్తుచేశారు.
ఆర్థిక క్రమశిక్షణ, డిసంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం భరించేలా కేంద్రం ఉదయ్ స్కీమ్ తేవడంతో తెలంగాణ కూడా చేరిందని చెప్పా రు. ఈ పథకంలో భాగంగా స్మార్ట్ మీటర్లు పెట్టాలని కోరగా, అప్పటికే వినియోగదారులందరికీ మీటర్లు ఉన్నందున స్మార్ట్ మీటర్లు ఎక్కడా పెట్టలేదని స్పష్టంచేశారు. ఆ తర్వాత 2021లో ఎఫ్ఆర్బీఎం రుణాలు 5 శాతం పెంచుతామని, రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా రైతుల ప్రయోజనాల కోసం నాడు సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదని గుర్తుచేశారు. ఫలితంగా రూ.30 వేల కోట్ల ఎఫ్ఆర్బీఎం నిధులు కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు.
మీడియాలో తప్పుడు వార్తలు
రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి స్మార్ట్ మీటర్లు బిగించలేదని జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి వ్యవసాయ బావి, లేదా ఆయనకు తెలిసిన ఎవరైనా రైతు మోటర్‌కు మీటరు బిగించామా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ రైతుల మోటర్లకు స్మార్ట్ మీటర్లు ఉన్నాయో రేవంత్ చెప్పాలని నిలదీశారు. అనుకూల మీడియాలో కరెంట్ మీటర్లపై పతాక శీర్షికలతో తప్పుడు వార్తలు రాయించారని విమర్శించారు. తప్పుడు వార్తలపై ఆయా మీడియా సంస్థలు తమ వైఖరిని మార్చుకోవాలని హితవుపలికారు. విద్యుత్తు సంస్థలను ప్రైవేట్ వాళ్లకు అప్పగించే విధానంలో భాగంగానే సీఎం చీప్ ట్రికులు ప్లే చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఎఫ్ఆర్బీఎం ప్రతిపాదనల కింద రైతుల మోటర్లకు మీటర్లు పెట్టనందునే తెలంగాణకు నిధులివ్వలేదని స్వయంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను మీడియా ప్రతినిధులకు జగదీశ్‌రెడ్డి చూపించారు. హైదరాబాద్ పాతనగరంలో కరెంటు బిల్లులు కట్టడం లేదని, పేపర్లలో తప్పుడు రాతలు రాయించారని పేర్కొన్నారు. అక్కడ కూడా విద్యుత్తు బిల్లులు 90-95 శాతం మేరకు వసూలవుతున్నాయని చెప్పారు. విద్యుత్తు బిల్లుల వసూలును ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు రేవంత్‌రెడ్డి రంగం సిద్ధంచేశారని, తొలుత ఓల్డ్‌సిటీ, తర్వాత రాష్ర్టాన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు కుట్రచేశారని మండిపడ్డారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటున్నట్టుగా పరిస్థితి ఉన్నదని ధ్వజమెత్తారు.
స్మార్ట్ మీటర్ల ప్రస్తావన దుర్మార్గం
స్మార్ట్‌మీటర్ల ప్రస్తావనను ఇపుడు తీసుకురావడంలో దుర్మార్గం దాగి ఉన్నదని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. కొలంబస్‌లా, వాసోడిగామాలా ఏదో కనిపెట్టినట్టు రేవంత్‌రెడ్డి ఉదయ్ స్కీమ్ పేపర్‌ను సభకు తీసుకొచ్చారని ఎద్దేవాచేశారు. అసెంబ్లీలో ఉన్నది ఉన్నట్టు చదవలేదని, మందబలంతో సభను ఏమార్చగలడేమో గానీ ప్రజల నుంచి రేవంత్‌రెడ్డి తప్పించుకోలేడని హెచ్చరించారు. కేంద్రం రాష్ట్రాల మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు ఎవరూ దాచిపెట్టలేరని, పబ్లిక్ డొమైన్లో ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. ‘విద్యుత్తు మీటర్లపై చర్చలో అసెంబ్లీలో తప్పించుకున్నవ్.. బహిరంగ చర్చకు వస్తావా రేవంత్ ? అని జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. స్మార్ట్ మీటర్ల పేరిట రైతులకు రేవంత్ ఉరేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తనకిష్టమైన ప్రైవేట్ సంస్థలకు విద్యుత్తు పంపిణీ వ్యవస్థను కట్టబెట్టేందుకు కొత్త డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలు రేవంత్ కుట్రలను గమనించాలని సూచించారు. సమావేశంలో మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే బాల సుమన్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కే వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.