హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటివరకు 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినట్టు ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా వెల్లడించిందన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులతోపాటు, నిరుద్యోగులను కూడా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా పెండింగ్ డీఏ లు, బకాయిలు క్లియర్ చేస్తామని, ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని మ్యానిఫెస్టోలో పొందుపరిచినట్టు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 28 నెలలు పూర్తయిందని, ఇప్పటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. తాజాగా పీఆర్సీ కమిషన్ గడువు పెంచడం ద్వారా మరో మూడేండ్లు ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చేసిందని చెప్పారు.
ఇది ఉద్యోగులకు నమ్మక ద్రో హం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 42శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని గుర్తు చేశారు. రెండో పీఆర్సీ కమిషన్ ఏడున్నర శాతమే ఇవ్వాలని సూచించినా, నాటి సీఎం కేసీఆర్ 30శాతం ఫిట్మెంట్ ఇచ్చారని వెల్లడించారు. మొత్తంగా ఉద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 72శాతం ఫిట్మెంట్ ఇచ్చిందన్నారు. అదనంగా తెలంగాణ ఉద్యమ ఇంక్రిమెంట్ ఇచ్చినట్టు తెలిపారు. పీఆర్సీ కమిషన్ నివేదిక రాకముందే 5శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. అసెంబ్లీ నడుస్తున్న సమయంలో విధానపరమైన నిర్ణయాలను సభ బయట తీసుకోవద్దనేది సంప్రదాయమని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఓవైపు జీఏడీపై చర్చ నడుస్తుండగానే ఉద్యోగుల పీఆర్సీపై గత ప్రభుత్వం నియమించిన కమిషన్ కాలపరిమితిని మరో ఆరు నెలలు పొడిగిస్తూ విధాన పరమైన నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం లేకనే గడువు పెంచుతూ పోతున్నారని మండిపడ్డారు.
కోర్టుకు వెళ్తేనే చెల్లిస్తారా?
600 మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, ఏప్రిల్ 9వ తేదీలోగా ఇవ్వాలని కోర్టు ఆదేశించినట్టు గుర్తు చేశారు. మరి మిగతా ఉద్యోగులు కూడా కోర్టును ఆశ్రయిస్తేనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులందరికీ తక్షణమే పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్ పెన్షన్ తెస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు రూ. వెయ్యి కోట్ల కాంట్రిబ్యూషన్‌ను సైతం చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, కారుణ్య నియామకాలు ఇవ్వడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేస్తున్నదని, ఇక శాఖపై అధికారులకు పట్టు ఎలా వస్తుందని హరీశ్ రావు ప్రశ్నించారు. విద్యుత్ శాఖలో ఐదుగురు, సింగరేణి సీఎండీగా నలుగురు, జీహెచ్ఎంసీ కమిషనర్లుగా నలుగురు, ఐఅండ్పీఆర్లో నలుగురు, పాఠశాల విద్యాశాఖలో నలుగురు కమిషనర్లు, ఆరోగ్యశ్రీలో 8 మంది సీఈవోలు మారారన్నారు. మున్సిపల్ శాఖలో ఐదుగురు, ఐటీలో ముగ్గురు, మైనింగ్‌లో ఆరుగురు, ఎన్హెచ్ఎంలో ముగ్గురు మారినట్టు తెలిపారు. ఇలా 140 మంది ఐఏఎస్‌లను మార్చారని వెల్లడించారు.
ఆర్టీసీ, ఆటో కార్మికుల సంగతేమిటి?
ఆర్టీసీ ఉద్యోగులను ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చుతారో స్పష్టమైన తేదీని ప్రకటించాలని హరీశ్‌రావు కోరారు. పీఆర్సీ, ఎరియర్స్ ఎప్పటిలోగా ఇస్తారో కూడా చెప్పాలని డిమాండ్ చేశా రు. ఈ విషయంలో ప్రభుత్వం విధాన నిర్ణయం వెల్లడించాలన్నారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలన్నారు.
పోలీస్‌శాఖకు రూ.400 కోట్లు ఎలా తగ్గిస్తారు?
పోలీసుల సంక్షేమం గురించి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని హరీశ్‌రావు విమర్శించారు. ‘తాళం వేయని ఆఫీసు ఏదైనా ఉందంటే పోలీస్‌స్టేషన్, అలాంటి పోలీస్‌శాఖకు ఈసారి బడ్జెట్‌ను తగ్గించారు. గత ఏడాదితో పోలిస్తే రూ.400 కోట్లు తగ్గించారు. సాధారణంగా ఏటా ఖర్చులు పెరుగుతుంటాయి. మరి ప్రభుత్వం దానిని ఎలా తగ్గిస్తుంది? నేను ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోలీసుల సంక్షేమం గురించి డీజీలు వచ్చి అడిగేవారు. వారికి ఇవ్వాల్సిన టీఏ, డీఏలు బీఆర్ఎస్ హయంలో సకాలంలో ఇచ్చాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 30జిల్లాల పోలీసులకు ఏడు టీఏలు, మూడు సరెండర్ లీవ్‌లు పెండింగ్‌లో పెట్టారు. వాటిని వెంటనే విడుదల చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక పోలీసులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 30 ఏండ్లు సర్వీస్ చేసిన వ్యక్తిని ఆత్మహత్య చేసుకొనే పరిస్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చిందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రాజేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలి
కోదాడలో కర్ల రాజేశ్ అనే దళిత యువకుడు లాకప్‌డెత్‌కు గురయ్యాడని, ఆయన కుటుంబాన్ని ఆదుకొని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 47,068 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశాము. రాష్ట్రంలో 17 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఐటీ టవర్స్‌పై కాంగ్రెస్ నిర్లక్ష్యం
బీఆర్ఎస్ల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్
హైదరాబాద్, మార్చి 26(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఐటీ టవర్స్‌ను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ తీరుతో ఈ టవర్లల్లో ఏర్పాటైన కంపెనీలు వెనక్కి వెళ్తున్నాయని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆందోళన వ్యక్తంచేశారు. దావోస్ పెట్టుబడులు-ఉపాధి అవకాశాల ప్రశ్న సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ సహా జిల్లాలకు ఐటీని విస్తరించేందుకు టవర్లు నిర్మించిందని గుర్తుచేశారు. సిద్దిపేట ఐటీ టవర్‌లో 18 కంపెనీలకుగాను ప్రస్తుతం 11మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. బిల్లులు కట్టక ఇంటర్నెట్ కూడా కట్ చేశారని పేర్కొన్నారు. తాము కంపెనీలకు కల్పించిన మూడేండ్ల ప్రీ రెంటల్ గడువు ము గిసిందని, మరో మూడేండ్లు పొడిగించాలన్నారు.
వచ్చిన కంపెనీలెన్ని.. ఇచ్చిన ఉద్యోగాలెన్ని : ఎమ్మెల్యేలు కాటిపల్లి, శంకర్
దావోస్ పర్యటనలతో లాభమెంతో చెప్పాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో సర్కార్‌ను డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు రెండేండ్లు విదేశాల్లో పర్యటించి, 2-3లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెబుతున్నారని, మరి ఎన్ని పరిశ్రమలు స్థాపించారో.. ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
స్వల్ప సంవాదం
దావోస్ పెట్టుబడులు-ఉపాధి అవకాశాల ప్రశ్నపై చర్చ సమయంలో స్వల్ప సంవాదం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, కార్పొరేషన్ చైర్మన్లు విదేశీ పర్యటనలకు వెళ్లారని వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించగా, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి కల్పించుకొని, తమ సొంత ఖర్చులతోనే దావోస్ వెళ్లామని చెప్పారు. స్పీకర్ జోక్యం చేసుకొని.. పెట్టుబడుల సదస్సుకు సీఎం, పరిశ్రమల శాఖ మంత్రి వెంట అసెంబ్లీ కార్యదర్శి వెళ్లరని, కేవలం సీపీఐ కాన్ఫరెన్స్‌కు మాత్రమే హాజరవుతారని, తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.