Harish Rao | సిద్దిపేట, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సన్నవడ్లకు బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్నవడ్లు 8.64 లక్షల టన్నులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.432 కోట్ల బోనస్ పెండింగ్‌లో ఉన్నదని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలు గొప్పగా, చేతలు చేదుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. 48 గంటలు కాదు 48 రోజులైనా రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమకాలేదని విమర్శించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను సిద్దిపేటలో మీడియా సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఉత్తమ్.. మీరు మాటల మనిషా? మోసం మనిషా? అని ప్రశ్నించారు. సన్న వడ్లు రైతులు అమ్ముకొని రెండు నెలలు దాటుతున్నా, బోనస్ డబ్బులు విడుదల చేయలేదని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలు నిలిపివేసి 50 రోజులు గడిచిపోతున్నాయని గుర్తుచేశారు. రెండో పంటకు సిద్ధం కావాల్సిన రైతులు బోనస్ కోసం అధికారుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. సన్నవడ్లకు ఇస్తామన్న బోనస్‌ను కూడా ఎగవేస్తున్నారని మండిపడ్డారు. అన్ని పంటలకు క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తామని ప్రకటించి ఇవ్వాళ యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ అంతంత మాత్రమే పూర్తి చేశారని, రైతుభరోసాకు కోతలు విధించారని ధ్వజమెత్తారు.
రైతు డిక్లరేషన్‌ను తుంగులో తొకారు
కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ రైతు డిక్లరేషన్‌ను తుంగులో తొక్కిందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు రైతుభరోసా, సన్న వడ్లకు బోనస్ పైసలు కూడా ఇవ్వలేదని, ఇలాంటి పరిస్థితుల్లో రెండో పంట ఎలా వేస్తారని ప్రశ్నించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ అబద్ధమా? మీరిచ్చిన బాండ్ పేపర్ బూటకమా? సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో రైతులంతా వ్యవసాయాన్ని పండగలా చేశారని, రేవంత్‌రెడ్డి పాలనలో దండగలా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. రైతు డిక్లరేషన్‌లో ప్రకటించినట్టుగా రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరానికి 15 వేల రైతుభరోసా, అన్ని పంటలకు బోనస్, కౌలురైతులకు రైతు భరోసాను 100 రోజుల్లో అమలుచేస్తానంటూ దేవుళ్ల సాక్షిగా ప్రమాణంచేసి, 420 రోజులైనా అమలు చేయలేదని విమర్శించారు.
ఉత్తమ్ మాటలు ఉత్తర ప్రగల్భాలు
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలు ఉత్తరకుమార ప్రగల్భాలాలు అయ్యాయని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా రైతులను ఇబ్బందులు పెట్టామా? అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా ముచ్చింతల రైతులు వడ్లు అమ్మి రెండు నెలలైనా ప్రభుత్వం బోనస్ చెల్లించడం లేదంటూ కలెక్టర్‌ను కలిస్తే.. ప్రభుత్వం విడుదల చేయడంలో ఆలస్యం అవుతున్నదంటూ సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. నంగునూరు మండలం గట్లమల్యాల రైతులు తనను కలిసి, సన్నవడ్ల డబ్బులు రాలేదని చెప్పారని, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నదన్నారు.
కందులు కొనుగోలు చేయాలి
షరతులు, కోతలు లేకుండా కందులను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కందులు ఎకరానికి మూడు క్వింటాల్లే కొంటున్నరు. ఇదేం పాలన? ఇది సగం పాలనా? ఎకరానికి మూడు క్వింటాళ్ల కందులు కొనుడు ఏంది? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎన్ని కందులు పండిస్తే అన్ని కొనుగోలు చేశామని గుర్తుచేశారు. ఎకరానికి ఆరు నుంచి పది క్వింటాళ్ల వరకు పండుతాయని, మిగితా కందులు ఎక్కడా అమ్ముకోవాలని నిలదీశారు. రైతు పండించిన మొత్తం కందులను కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంది రైతుల మీద ఎందుకు పగ? అని మండిపడ్డారు. క్రాప్ బుకింగ్‌లో మిస్సింగ్ అయిన రైతులకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మూడు క్వింటాళ్ల కందులను కొనుగోలు చేయడాన్ని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు సమర్థిస్తున్నారా? అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల ముందు కందులకు రూ.400 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఎగ్గొడుతున్నారని విమర్శించారు. కందుల మద్దతు ధర రూ.7,500కు బోనస్ రూ.400 కలిపితే రూ.7,900కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో కంది సాగు అయితే, క్రాప్‌బుకింగ్ ఆరు లక్షల ఎకరాల వరకు అయిందని చెప్పారు. క్రాప్ బుకింగ్ చేయక పోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా? దీనికి రైతులు ఎందుకు బలి కావాలి? అని ప్రశ్నించారు. కంది పండించిన రైతులందరి వద్ద కందులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
పొద్దుతిరుగుడు కేంద్రాలు ప్రారంభించాలి
పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను కూడా వెంటనే ప్రారంభించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నూనె గింజలు పండించే రైతులకు ప్రభుత్వం శఠగోపం పెడుతున్నదని విమర్శించారు. పొద్దుతిరుగుడు క్వింటాల్‌కు రూ.7,280 మద్దతు ధర ఉన్నదని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు బయట మార్కెట్లో 6 వేలకు అమ్ముకుని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కందులు, పొద్దుతిరుగుడు, పల్లి పంటను షరతులు లేకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ మోసకారి
కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని అన్ని గ్రామాల్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారని హరీశ్‌రావు చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలు చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తాను తవ్వుకున్న గ్యారెంటీల సమాధిలోనే సమాధి అవుతుందని ఎద్దేవా చేశారు. ఇక్కడి గ్యారంటీల వైఫల్యాల ఎక్కడెక్కడో కాంగ్రెస్ పార్టీని గాయబ్ చేస్తున్నదని, ఇకడ కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ పార్టీని గాలిలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాజనర్సు, పూజల వెంకటేశ్వరరావు, మనోహర్‌రావు, సంపత్‌రెడ్డి, భూపేష్, వేణుగోపాల్‌రెడ్డి, సోంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రియల్ ఎస్టేట్‌లో కాంగ్రెస్ డిజాస్టర్
‘కాంగ్రెస్ పాలనలో రియల్ఎస్టేట్ రంగం డిజాస్టర్ అయింది. సర్కారు అనాలోచితంగా తెచ్చిన హైడ్రా, మూసీ, ఫార్మా, మెట్రోలైన్ ప్రాజెక్టులతో సంక్షోభంలో కూరుకుపోయింది’ అని హరీశ్‌రావు విమర్శించారు. ఏడాదిన్నరగా హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ రంగం కుదేలవుతున్నా రేవంత్ సర్కారు చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రియల్ఎస్టేట్ వ్యాపారులు వేణుగోపాల్‌రెడ్డి, నరసింహగౌడ్ ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. వీరి బలిదానాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. రైతన్నలు, నేతన్నలు, ఆటోడ్రైవర్లతో మొదలైన ఆత్మహత్యల పరంపర రియల్‌ఎస్టేట్‌కు చేరడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో తెలంగాణ గ్రోత్ఇంజిన్ అయిన హైదరాబాద్ అభివృద్ధికి విఘాతం కలుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుందనే విషయం మున్సిపల్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రికి తెలియదా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి ఎందుకు క్షీరాభిషేకం చేయాలి? రుణమాఫీ చేయనందుకా? రైతుబంధు ఇయ్యనందుకా? సన్నవడ్లకు బోనస్ ఇయ్యనందుకా? రండి.. గ్రామాలకు వస్తే ఏ అభిషేకాలు చేయాలో ప్రజలు చేసి చూపిస్తారు.
– హరీశ్‌రావు
బీఆర్ఎస్ది జగమంతా పాలన.. కాంగ్రెస్‌ది సగమంత పాలన. మాది అసలు పాలన.. మీది కొసరు పాలన. సంతృప్తి, సంక్షేమం బీఆర్ఎస్ పాలన.. సంక్షోభం, అసంతృప్తి, అసహనం కాంగ్రెస్ విధానం.
– హరీశ్‌రావు
కందులు పండించిన రైతుల నుంచి ఎకరాకు మూడు క్వింటాళ్లే కొనుగోలు చేస్తున్నరు. మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి? మూడు క్వింటాళ్లే కొనుగోలు చేసుడు ఏంది? కంది రైతుల మీద ఇంత పగ ఎందుకు? ఇంత కక్ష ఎందుకు? కందుల పండించడం నేరమా?
– హరీశ్‌రావు
ప్రభుత్వానికి హరీశ్‌రావు ప్రధాన డిమాండ్లు
1.46 లక్షలు రావాలి
నేను 13 ఎకరాల్లో వరి సాగు చేశాను. సొసైటీకి రెండు నెలల కిందట 292 క్వింటాళ్ల ధాన్యం విక్రయించా. సుమారు రూ.1.46 లక్షల వరకు బోనస్ రావాల్సి ఉంది. ప్రభుత్వ ప్రకటనలు ప్రచారానికే పరిమితమవుతున్నాయి. రైతులకు బోనస్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. బోనస్ నగదు కోసం ప్రతిరోజూ ఎదురుచూస్తూనే ఉన్నా. బోనస్‌తో ఆర్థిక భరోసా పెరుగుతుందని అనుకున్నా. కానీ ప్రభుత్వం చేస్తున్న ఆలస్యంతో వరి రైతులం మోసపోతున్నాం. బోనస్ అందని రైతులు ఇంకా చాలామంది ఉన్నారు.
– ఆకుల రామకృష్ణ, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా
బోనస్ నగదు జమ కాలేదు
మూడు ఎకరాల్లో 60 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. సన్నాలకు బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో కొనుగోలు కేంద్రంలో విక్రయించా. కానీ, ఇప్పటి వరకూ బోనస్ రాలేదు. ఎప్పుడు అడిగినా రేపు, మాపు అంటున్నారు. 45 రోజులుగా ఎదురుచూస్తున్నా. రోజూ బ్యాంకుకు వెళ్లి బ్యాలెన్స్ చూసుకుంటున్నా. బోనస్ నగదు మాత్రం జమకావడం లేదు. అసలు ఇస్తారో.. ఇవ్వరో కూడా తెలియడం లేదు. సార్లను అడిగితే ‘పడతాయి ఆగండి’ అంటున్నారు.
– ముదిగొండ కృష్ణ, వడ్డిగూడెం, అన్నపురెడ్డిపల్లి , ఖమ్మం జిల్లా
మాట నిలబెట్టుకోవడమంటే ఇదేనా?
నాది భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామం. 80 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించా. ఇంత వరకు బోనస్ నగదు రాలేదు. 45 రోజులు గడిచిపోయాయి. రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ను నమ్మి ప్రభుత్వానికే ధాన్యం విక్రయించా. కానీ, ఇంకా బోనస్ జమ చేయలేదు. మాట నిలబెట్టుకోవడం అంటే ఇదేనా? బోనస్ ఇవ్వలేమని ముందుగా చెబితే మేం బయటే విక్రయించుకునేవాళ్లం కదా? ఇంత మోసమా? రైతుభరోసా విషయంలోనూ ఇలాగే చేస్తున్నారు. ఇంకా చాలామందికి రాలేదు.
– మానికల విజయలక్ష్మి, రావికంపాడు, చండ్రుగొండ, ఖమ్మం జిల్లా
అధికారులు పట్టించుకోవడం లేదు
రెండు ఎకరాల్లో వరి పండించా. 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 వందల బోనస్ ఇస్తామని చెప్పడంతో పెట్టుబడి కోసం అప్పు చేశా.. వడ్లు అమ్మినప్పుడు కూడా వారం రోజుల్లో డబ్బులు పడతాయని చెప్పారు. కానీ, జమకాలేదు. అధికారుల చుట్టూ చాలాసార్లు తిరిగాక 20 రోజులకు డబ్బులు పడ్డాయి. బోనస్ ఏమైందని అడిగితే నీకు రాలేదని చెబుతున్నారు. ఎంత మంది రైతులను ప్రభుత్వం ఇలా మోసం చేస్తుంది. అందరికి వేస్తామని చెప్పి వేయకపోవడం దారుణం.
– రవికుమార్, కోడూరు, మహబూబ్‌నగర్ మండలం
ఇంకా బోనస్ డబ్బులు రాలే
రెండెకరాల్లో జై శ్రీరాం వడ్లు వేసిన. రెండు నెలల కిందట 40 క్వింటాళ్ల వడ్లు సహకార సంఘపోళ్లకు అమ్మిన. క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తమంటే ఆశపడిన. కాంట పెట్టేటప్పుడు వారంలోనే బోనస్ డబ్బులు పడతయన్నరు. ఇంతవరకు పడలే. సంఘపోళ్లను అడిగితే రేపు.. మాపు అంటున్నరు. నాతో పాటు చాలామంది రైతులకు బోనస్ రావాలి. ప్రైవేట్ వాళ్లకి అమ్మితే క్వింటాలుకు 2,800 చొప్పున కొన్నరు.
– కుడె పోషన్న, గిరివెల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా