‘నాకు భారత రాజ్యాంగం, చట్టాలంటే అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. ఆ ప్రకారమే ఓ బాధ్యతగల పౌరుడిగా నేను ఏసీబీ విచారణకు వచ్చాను. వాస్తవానికి ఫార్ములా ఈ-కార్ రేసుపై హైకోర్టులో కొన్ని గంటలపాటు వాదనలు జరిగాయి. తీర్పు కూడా రిజర్వ్‌లో ఉంది. అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి.. రాలేనని నేను చెప్పొచ్చు. అలా చేయకుండా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా 10 గంటలకు ఏసీబీ విచారణకు వచ్చాను’
గ్రీన్ కో అనే కంపెనీ దేశంలోని అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది. పార్లమెంట్ ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వడం అవినీతి అని ఎలా అంటారు? గ్రీన్ కో కంపెనీ ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది 2022లో అయితే.. ఫార్ములా – ఈ రేసు జరిగింది 2023లో. బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిన అదే కంపెనీ.. కాంగ్రెస్,బీజేపీకి కూడా ఇచ్చింది.
ఇప్పుడేమో ఏసీబీ కేసు.. ఇంతకుముందు అల్లు అర్జున్ కేసు.. అంతకుముందు ఫోన్ ట్యాపింగ్ కేసు.. అప్పుడేమో కాళేశ్వరం కేసు. ఇలా డైవర్షన్‌లో బతకడం తప్ప.. ఆయన చేసిన గొప్ప పని ఏమైనా ఉందా?. నిత్యం ఏదో ఒక డ్రామా పెట్టి, ప్రజలను డైవర్షన్ చేస్తుండు’
– కేటీఆర్
KTR | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): తనకు ప్రభుత్వ తీరుపై నమ్మకం సన్నగిల్లిందని, అందుకే న్యాయవాదితో ఏసీబీ విచారణకు వచ్చానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఏసీబీ ఇచ్చిన నోటీసుల మేరకు కేటీఆర్ సోమవారం విచారణకు హాజరయ్యారు. అయితే ఏసీబీ అధికారులు కేటీఆర్‌తోపాటు ఆయన లాయర్‌ను లోపలికి అనుమతించలేదు. విచారణకు ఒక్కరే హాజరు కావాలని ఆదేశించారు. న్యాయవాదితోనే విచారణకు వస్తానని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఏసీబీ సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో.. ఆయన రోడ్డుపైనే మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంపై తనకున్న నమ్మకంతోనే ఏసీబీ విచారణకు వచ్చానని చెప్పారు. గతంలో లగచర్ల కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేసినప్పుడు ఆయన అనని మాటలను అన్నట్టు తప్పుడు
స్టేట్మెంట్ ఇచ్చి ఇబ్బందులు పెట్టారని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు తాను ఒక్కడ్నే వెళ్తే.. లేనిపోని ఆరోపణలు, నిందలు వేసి, తాను మాట్లాడని మాటలు కూడా వక్రీకరించి, తప్పుడు స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం ఉందని, అందుకే తాను లాయర్తోనే విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ‘నా తరఫు న్యాయవాదితో విచారణకు వెళ్లడం నా హక్కు. అది రాజ్యాంగం కల్పించింది. దానిని కూడా ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు’ అని కేటీఆర్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, పోలీసులు కాలరాస్తున్నారని విమర్శించారు. ‘పట్నం నరేందర్‌రెడ్డి చెప్పని మాటలు కూడా కలిపి.. తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి.. 40 రోజులు అత న్ని జైల్లో ఉంచారు. అందులో నా పేరు చెప్పించి, నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా నేను చేయంది ఏదో చేశానని.. తన అనుకూల మీడియాకు లీకులిచ్చి, దేశమంతా టాంటాం చేయాలనే కుట్ర జరుగుతున్నది. అలా జరగొద్దంటే నాకు న్యాయపరమైన సపోర్ట్ కావాలనే లాయర్‌తో వచ్చాను’ అని వివరించారు. కాంగ్రెస్ పాలనలో పోలీసు డిపార్ట్మెం ట్ తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించడంలో ఆరి తేరిందని, ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో.. దర్శక దిగ్గజం రాజమౌళికంటే ఎక్కువగా స్క్రిప్ట్‌లు, స్టేట్మెంట్లు తయా రు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరు తూ తాను వేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు జరిగాయని, హైకోర్టు తీర్పును రిజర్వు చేసిందని కేటీఆర్ తెలిపారు. ‘ఈ అంశాన్ని చూపించి ఏసీబీకి లేఖ రాసి నేను రాకుండా ఉండొచ్చు. నేను అలా చేయలేదు. బాధ్యతగల వ్యక్తిగా విచారణకు వచ్చాను. నా లాయర్‌తో ఎం దుకు అనుమతించరు?.. ఈ కేసులో ఏం జరిగిందో వాస్తవాలు చెప్పడానికే వచ్చాను. అయినా నన్ను అనుమతించడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘క్వాష్ పిటిషన్ కోసం ఇచ్చిన అఫిడవిట్లో నేను అన్ని విషయాలు వివరంగా చెప్పాను. సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చాను’ అని వివరించారు. ‘ఒకవేళ నేను లాయర్ లేకుండా వెళ్తే.. వందశాతం నాపై తప్పులు బనాయిస్తారు. నేను కేసును ఒప్పుకున్నానని, ఏదో తప్పులు చేశానని, ఇదే అనుకూ ల మీడియా బ్రేకింగ్‌లు వేస్తుంది. రేవంత్‌ను నేను నమ్మను కాబట్టే.. లాయర్‌తో వస్తానని చెప్పా’ అని తెలిపారు.
‘ఈ రోజు నా మామ రెండో సంవత్సరీకం. ఇంట్లో ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సంవత్సరీకం, ఆ పూజల మీద కూడా పడి.. మేము దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు. మీరు అంతలా దిగజారి చేస్తానంటే చేసుకోండి’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు. నిజాయితీగా ఉన్నాను కాబట్టే.. విచారణకు వచ్చాను. కానీ లాయర్‌ను తీసుకెళ్తానంటే వీళ్లకు ఎందుకు భయమవుతున్నదో అర్థం కావట్లే. ఇందులో దాపరికం ఏముంది?’ అని కేటీఆర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. ‘గతంలో కూడా ఫ్యామిలీ దావత్ చేసుకుంటుంటే 150 మంది పోలీసులతో వచ్చి రేవంత్ ప్రభుత్వం దాడులు చేసింది. కుక్కలను తీసుకొచ్చి డ్రగ్స్ కోసం వేటాడారు. సీఎంగారు ఏకంగా అసెంబ్లీలోనే డ్రగ్స్ దొరికాయని అబద్ధాలు చెప్తారు. ఆ నీతిమాలిన మనిషితో ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం’ అని మండిపడ్డారు.
‘రేవంత్ చేస్తున్న ఈ పన్నాగమంతా డైవర్షన్ పాలిటిక్స్ కోసమే. రాహుల్‌గాంధీ, ఖర్గే, సోనియాగాంధీ ఇచ్చిన మాట, మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా రైతులకు ఇస్తామన్న 15 వేలు ఇవ్వడం లేదు. రైతుల నుంచి వచ్చే వ్యతిరేకతను కప్పి పుచ్చేందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్‌ను వాడుతున్నాడు. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడల్లా ఏదో ఒక అంశాన్ని తన అనుకూల మీడి యా ద్వారా తెరమీదకు తెస్తున్నాడు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను రైతులకు, కార్యకర్తలకు, నాయకులు చేసే విజ్ఞప్తి ఒక్కటే.. ఈ కేసు లో ఎలాంటి పస లేదు. దీని వల్ల రేవంత్ సాధించేదేమీ లేదు’ అన్నారు.
‘ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ మీద క్వాష్ పిటిషన్ వేశాను. ఇవాళ ఏసీబీ విచారణకు వచ్చాను. ఈ హంగామా కేసు తేలిన తర్వాతే ఈడీ ముందుకు వెళ్లేది లేనిది చెప్తాను. ప్రస్తుతం ఈ కేసు విచారణ ఏంటో తేలాలి’ అని కేటీఆర్ అన్నారు. ‘రేవంత్‌రెడ్డి ఏం చెబితే.. అది మీడియాలో ప్రసారం అవుతుంది. ఆ స్థాయిలో లీకు లు ఇస్తున్నారు. ప్రతిదీ డ్రామా చేస్తున్నారు. అందుకే ఫస్ట్ ఈ ఏసీబీ కథేందో తేల్చాలి’ అని కేటీఆర్ అన్నారు. మీరు భయపడుతున్నారా? అన్న మీడియా ప్రశ్నకు ‘నేనేం రేవంత్రెడ్డిలాగ లుచ్చాపనులు చేయలేదు. నేను భయపడను. ప్రస్తుతం ఏసీబీ ఆఫీసు ముందే ఉన్నా..’ అని కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
ఏసీబీ అర్థాన్ని ముఖ్యమంత్రి పూర్తిగా మార్చివేశారని కేటీఆర్ విమర్శించారు. ‘యాంటి కరప్షన్ బ్యూరో ను కాస్తా.. ఎనుముల కాన్స్పిరసీ బ్రాంచ్ (ఏసీబీ)గా మార్చారు. సీఎం కనుసన్నల్లోనే పోలీసులు, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి’ అని పేర్కొన్నారు. తాను మంత్రిగా నిర్ణయం తీసుకున్నానని, అందుకు సంబంధించిన చెల్లింపులు, నిబంధనలు చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని అన్నారు. కోర్టు తీర్పు రిజర్వ్ అయినప్పటికీ ఏసీబీ నోటీసులు ఇచ్చినా.. బాధ్యతతో విచారణకు వచ్చానని కేటీఆర్ చెప్పారు. 40 నిమిషాలు వేచి చూసిన అనంతరం.. ఏసీబీ విచారణాధికారి ఏసీపీ ఖాన్ రావడంతో ఆయనకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దీంతో ఆయన అది తీసుకున్నట్టు సంతకం చేశారు.
నా ఇంట్లో ఉత్తుత్తి తనిఖీలు చేపట్టి, కొన్ని డాక్యుమెంట్లు ఇంట్లోకి దొడ్డిదారిన చొప్పించి.. ఈ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని నాకు విశ్వసనీయ సమాచారం ఉంది. ఇది రేవంత్‌రెడ్డి క్రిమినల్ మైండ్‌సెట్.
– కేటీఆర్
ఫార్ములా-ఈ రేసు నిర్వహణ సంస్థల్లో ఒకటైన గ్రీన్కో కంపెనీ బీఆర్ఎస్కు లంచం ఇచ్చిందని, క్విడ్ ప్రోకో విధానంలో డబ్బులు చెల్లించారన్న ఆరోపణలపై పలువురు మీడియా మిత్రులు వేసిన ప్రశ్నలకు కేటీఆర్ వివరణ ఇచ్చారు. గ్రీన్ కో అనే కంపెనీ దేశంలోని అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిందని చెప్పారు. పార్లమెంట్ ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వడం అవినీతి అని ఎలా అంటారని ప్రశ్నించారు. గ్రీన్ కో కంపెనీ ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది 2022లో అయితే.. ఫా ర్ములా – ఈ రేసు జరిగింది 2023లో అని కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్కు బాండ్లు ఇచ్చిన అదే కంపెనీ.. కాంగ్రెస్, బీజేపీకి కూడా ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. అయి తే, ఫార్ములా ఈ-కార్ రేసు కారణంగా గ్రీన్ కో అనే కంపెనీ నష్టపోయిందని, అలా నష్టపోయిన సంస్థలెవరైనా ఉల్టా లంచాలు ఇస్తాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పనికిమాలిన ఆరోపణలను వదిలేసి.. ఇకనైనా సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల బాగోగుల గురించి ఆలోచించాలని కేటీఆర్ హితవు పలికారు.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఫార్ములా-ఈ రేసింగ్ కేసులో 7న విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులకు కేటీఆర్ స్పందించారు. సోమవారం ఈడీ అధికారులకు సమాధానం పంపారు. ఏసీ బీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచిందని తెలిపారు. ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువడేంతవరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని ఈడీ అధికారులను కేటీఆర్ కోరారు. అందుకు ఈడీ అంగీకారం తెలుపుతూ.. తదుపరి తేదీని త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నది. కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఇప్పటికే ఏసీబీని ఆదేశించడంతోపాటు దర్యాప్తునకు సహకరించాలని కేటీఆర్‌కు సూచించింది. సోమవారం ఆయ న తన న్యాయవాదిని వెంటబెట్టుకుని ఏసీబీ దర్యాప్తునకు వెళినప్పటికీ పోలీసులు అనుమతించలేదు. దీంతో న్యాయవాదిని అనుమతించకపోవడం తన హకులకు భంగం కలిగించడమేనని, ఏసీబీ ఉద్దేశపూర్వకంగా తన న్యాయవాదిని అడ్డుకుంటున్నదని కేటీఆర్ చెప్పారు.